Telugu Gateway
Movie reviews

'అఖండ‌' సినిమా రివ్యూ

అఖండ‌ సినిమా రివ్యూ
X

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన సినిమా 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ సినిమా కావ‌టంతో దీనిపై అంచ‌నాలు పీక్ కు చేరాయి. అంతకు ముందు వీరిద్ద‌రూ క‌ల‌సి చేసిన సింహా, లెజండ్ సినిమాలు మంచి హిట్ ద‌క్కించుకోవ‌టంతో దీనిపై బాలకృష్ణ ఫ్యాన్స్ భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. అభిమానుల హాంగామా మ‌ధ్య అఖండ గురువారం నాడు విడుద‌లైంది. ఎక్క‌డా చూసిన బాలకృష్ణ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ న‌డిచింది. ఈ సినిమాలో తొలి సారి బాలకృష్ణ కు జోడీగా ప్ర‌గ్యాజైస్వాల్ న‌టించింది. ఈ సినిమాలో బాలకృష్ణది ద్విపాత్రిభిన‌యం. ఓ పాత్ర గ్రామంలో ఉంటూ ఫ్యాక్ష్య‌నిస్టుల‌ను మారుస్తూ జీవితం విలువ‌ను చెప్పే అతి మంచి పాత్ర‌. రెండ‌వ‌ది అఖండ‌. సినిమా ఫ‌స్టాఫ్ లో సంస్క‌ర‌ణ‌వాది బాలకృష్ణ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అప్పుడే క‌లెక్ట‌ర్ గా ఆ ప్రాంతానికి వ‌చ్చిన ప్ర‌గ్యాజైస్వాల్ తో ల‌వ్ ట్రాక్, పెళ్లి, పిల్ల‌లు. ఎవ‌రైనా స‌రే ప్రకృతి కాపాడాలే కానీ..దాన్ని నాశ‌నం చేస్తే స‌మ‌స్య‌లు ఎలా వ‌స్తాయో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను. ఫ్యాక్ష్య‌న్ వ‌దిలేసి ఎంపీగా గెలిచిన సుబ్బారాజు ఏకంగా కేంద్ర మంత్రి అవుతాడు. అయినా స‌రే ఎప్పుడూ ఊరిలో ఉండే బాల‌కృష్ణ చేసే సేవా కార్య‌క్ర‌మాల‌కు అండ‌గా నిలుస్తాడు. ఓ ఆస్ప‌త్రిలో ఉండ‌గా జ‌రిగిన బాంబు పేలుళ్ళ‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సుబ్బ‌రాజు, వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఎన్ ఐఏ టీమ్ బాల‌కృష్ణ ను అరెస్ట్ చేస్తుంది..క‌లెక్ట‌ర్ గా ఉన్న ప్ర‌గ్యాజైస్వాల్ స‌స్పెన్ష‌న్ కు గుర‌వుతుంది.

అడవుల్లో స్మ‌గ్లింగ్ చేసుకునే వ్య‌క్తి ఓ ఆశ్ర‌మం పెద్ద‌ను చంపి ఆ సీటులో ఆసీనుడు అవుతాడు..అప్ప‌టి నుంచి స్వామిజీ అక్ర‌మ మైనింగ్ కు అండ‌దండ‌లు అందిస్తూ ఉంటాడు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అక్ర‌మ మైనింగ్ ను సాగించే వ్య‌క్తి వ‌ర‌ద‌రాజులుగా శ్రీకాంత్ న‌టించాడు. తొలిసారి ఈ సినిమాలో విల‌న్ పాత్ర పోషించాడు. అఖండ ఎంట్రీతోనే సినిమాలో వేడి పెరుగుతుంది. చిన్న‌పిల్ల‌ల ప్రాణాల‌కు హానిత‌ల‌పెట్టినా, ప్ర‌కృతిని ధ్వంసం చేయాల‌ని చూసినా అఖండ రంగ ప్ర‌వేశం చేస్తాడు. ఫ‌స్టాఫ్ నుంచి క్లైమాక్స్ వ‌ర‌కూ ఈ సినిమాలో సంభాష‌ణ‌లు సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. కాక‌పోతే బోయ‌పాటి శ్రీను సినిమా అంటే ఉండే అతి హింస‌. అదుపుత‌ప్పిన హీరోయిజం ఈ సినిమాలోనూ మ‌రీ ఎక్కువైంద‌నే చెప్పాలి. తొలిసారి విల‌న్ గా చేసిన శ్రీకాంత్ లుక్ ప‌రంగా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. పూర్తిగా మాస్ ప్రేక్షకుల‌ను టార్గెట్ చేసుకునే బోయ‌పాటి సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు క‌న్పిస్తుంది. ఈ సినిమాకు త‌గ్గ‌ట్లే త‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఏ ఎం ర‌త్నం మాట‌లే సినిమాలో అస‌లైన బ‌లం అని చెప్పొచ్చు. అఘోరా పాత్ర‌లో బాల‌కృష్ణ లుక్ ఆక‌ట్టుకుంది. ఓవ‌రాల్ గా చూస్తే ఇది సాధార‌ణ ప్రేక్షకుల కంటే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని చెప్పొచ్చు. సామాన్య ప్రేక్షకులు అయితే ఈ అఖండ హింస ఏమిటో అని భ‌య‌ప‌డాల్సిందే.

రేటింగ్. 2.5-5

Next Story
Share it