అల్లరి నరేష్ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడా?!(Aa Okkati Adakku Movie Review)
ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరూ మాట్రిమోనీ సైట్స్ పై ఇంత సీరియస్ కథతో సినిమా తీయలేదు అనే చెప్పాలి. దర్శకుడు మల్లి అంకం కథ ఎక్కడా కూడా పక్కకు తప్పకుండా పర్ఫెక్ట్ గా నడిపించారు. వయసు పెరిగిపోతున్నా పెళ్లికాని అబ్బాయిలు పడే ఇబ్బందులు, ఎంతో సున్నితమైన పెళ్లి అంశంతో పెళ్లి సంబంధాలు చూసే కంపెనీలు..సైట్స్ తమ వ్యాపారం కోసం ఎలా వాడుకుంటాయి అన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. మరో వైపు పెళ్లి కానీ అబ్బాయిలను పెళ్ళెప్పుడు అంటూ అటు ఇంటి పక్కన ఉండే వాళ్ళు ..ఆఫీసుల్లో వాళ్ళు పెట్టే ఇబ్బందిని ఈ సినిమాలో బాగా చూపించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతుంటాడు. దీనికి ప్రధాన కారణం ముందే తన తమ్ముడి పెళ్లి కావటం. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పెళ్లి సంబంధాలు చూసే కంపెనీలో పని చేస్తుంది. ఈ కంపెనీలో పెళ్లి సంబంధాల కోసం తమ దగ్గరికి వచ్చే వాళ్ల నుంచి మెంబర్ షిప్ ఫీజు కూడా గోల్డ్, ప్లాటినం ఇలా కేటగిరీల వారీగా తీసుకుంటారు.
ఈ కంపెనీలో పని చేసే ఫరియా ఫేక్ పెళ్లి కూతురు అవతారం ఎత్తి చాలా మందిని మోసం చేస్తుంది. ఒక బీచ్ లో అల్లరి నరేష్ కు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా యాక్సిడెంటల్ గా కలుస్తుంది. తర్వాత మాట్రిమోనీ కంపెనీ ద్వారా వీళ్లిద్దరు మళ్ళీ కలుసుకుంటారు. ఆ తర్వాతే కథలో అసలు ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఈ సినిమాలో హై లైట్ అంటే అల్లరి నరేష్ మరదలిగా నటించిన జామీ లీవర్ నటనే అని చెప్పొచ్చు. ఆమె ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉండేది కొద్దిసేపే అయినా కూడా వైవా హర్ష, షకలక శంకర్ లు కాసేపు నవ్విస్తారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా అక్కడక్కడా గ్లామర్ మెరుపులతో పాటు ...భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి నటన తో ఆకట్టుకున్నారు. మొత్తం మీద చూస్తే ఆ ఒక్కటి అడక్కు టైటిల్ సరదా..సినిమా సీరియస్. ఎలాంటి ద్వందార్ధాలు లేకుండా...సినిమా సబ్జెక్టు పైనే ఫోకస్ పెట్టారు. పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది అని చెప్పొచ్చు.
రేటింగ్: 3 /5