`రాజరాజచోర` మూవీ రివ్యూ
శ్రీవిష్ణు. ఓ విభిన్న నటుడు. ఆయన సినిమాల్లో హీరోయిజం కంటే సరదా సరదా సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి. అలా వచ్చిన సినిమాలే చాలా వరకూ హిట్ బాట పట్టాయి. `రాజరాజచోర` సినిమా కూడా ఆ కోవకు చెందినదే. అంతకు ముందు విడుదల అయిన ఈ హీరో సినిమా గాలి సంపత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పాలి. `రాజరాజచోర` ట్రైలర్ లోనే ఈ సినిమాలో ఏదో విషయం ఉందనే అభిప్రాయం కలుగుతుంది ప్రేక్షకులకు. సినిమా విడుదల అనంతరం అదే నిజం అని తేలిందని చెప్పొచ్చు. ఇక సినిమా అసలు విషయానికి వస్తే హీరో శ్రీవిష్ణు ఓ వైపు దొంగగా..మరో వైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రల్లో వేరియేషన్స్ బాగా చూపించాడు. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అత్యంత కీలకమైన భావోద్వేగాల సన్నివేశాల్లో శ్రీవిష్ణు పరిణితి చూపించాడు. అబద్దాలు బంధాలను నిలపవు అనే పాయింట్‌ను దర్శకుడు హసిత్ గోలి ఈ `రాజరాజచోర` సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు. పరిమితమైన పాత్రలతోనే ఎక్కడా గందరగోళాలకు తావివ్వకుండా హసిత్ కథనాన్ని నడిపించాడు. అక్కడక్కడ స్లోగా నడిచినట్లు కన్పించినా ప్రేక్షకులు ఎక్కడా కూడా మరీ బోర్ పీలవ్వరు. అబద్దాలు చెప్పే హీరోకు భార్య, ప్రియురాలు ఉంటారు.
వారి మధ్య అనుబంధాలు.. భార్యను విడిచిపెట్టి హీరో వెళ్లిపోవాలని అనుకుంటున్న తరుణంలో ఓ చిన్న ట్విస్ట్.. భార్యపై ప్రేమ పెరగడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. సినిమాలో పలు కీలక అంశాలను కాస్త కామెడీ కోణంలో, ఎమోషన్స్‌ను మిక్స్ చేస్తూ తెరకెక్కించారు. ప్రథమార్థంలో హీరో, అతను చేసే దొంగతనాలు, పోలీసులకు చిక్కడం, మధ్యలో హీరో భార్య, ప్రేయసితో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తొలి పదిహేను నిమిషాల తర్వాత సినిమా కాస్త స్పీడందుకుంటుంది. హీరోకు అప్పటికే పెళ్లై, పిల్లాడునాడనే సంగతిని దర్శకుడు చక్కగా రివీల్ చేశాడు. శ్రీవిష్ణు సమయాన్ని బట్టి మార్చే డైలాగ్ టోన్, లుక్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే గంగవ్వ, శ్రీవిష్ణు మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. రవిబాబు కీలకపాత్రలో నటించిన సినిమాలో తనదైన మార్క్ చూపించారు. చివరి ఇరవై నిమిషాలు సినిమా ఓ ఎమోషనల్ కోణంలోసాగుతూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే `రాజరాజచోర` సినిమా ప్రేక్షకులను సరదాగా నవ్విస్తాడు.
రేటింగ్.3-5