'అద్భుతం' మూవీ రివ్యూ
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా అద్భుతం. శివానీ రాజశేఖర్ తొలి సినిమా ఇదే. శుక్రవారం నాడు ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నెంబర్ ఉండటం ఒకెత్తు అయితే..హీరో, హీరోయిన్లు ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవాలనుకకుంటారు. హీరో ఏమో తన తండ్రి తన వల్లే చనిపోయాడనే బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హీరోయిన్ మాత్రం తన తండ్రి పెళ్లి వేధింపుల వల్ల చనిపోవాలనుకుంటుంది. కానీ తన చావుకు ఎవరూ కారణం కాదంటూ హీరో తన ఫోన్ కు తానే మెసేజ్ పెట్టుకుంటాడు. అయితే ఆ మెసేజ్ హీరోయిన్ ఫోన్ కు వెళుతుంది. ఈ మెసేజ్ లు చూసి అసలు ఏమి జరుగుతుందో అర్ధం కాక ఇద్దరూ ఆత్మహత్య ప్రయత్నాలను వాయిదా వేసుకుంటారు. ఇంకా భూమి మీద ఉండి చేయాల్సి ఏదో ఉందనే తాము బతికామనుకుంటారు. ఒకరినొకరు చూసుకోకుండా అలా స్నేహం కొనసాగిద్దామనుకుంటారు. కానీ మధ్యలో ఇద్దరూ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలోనే హీరో 2019 సంవత్సరంలో ఉంటే...హీరోయిన్ మాత్రం 2014 సంవత్సరంలోనే ఉంటుంది.
ఐదేళ్ల టైమ్ గ్యాప్ మధ్యలో సాగిన ప్రేమ కథే ఈ సినిమా. తొలి గంట వరకూ సినిమా మధ్యమధ్యలో సత్య సంభాషణలతో సరదాగానే సాగుతుంది. తర్వాత కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. అయితే ఇవి మాత్రం ఆసక్తికరంగా లేకపోవటంతో పాటు ఒకింత చికాకు పుట్టిస్తాయి. ఏ మాత్రం లాజిక్ కు అందని సన్నివేశాలతో సినిమా సాగుతుంది. అయితే ఉన్నంతలో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ లు తమ పాత్రల్లో మంచిగా నటించారు. సత్య సందడి ఓకే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించగా..మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఆద్భుతం సినిమా కోసం తీసుకున్న లైన్ ఆసక్తికరంగా ఉన్నా సినిమాను ప్రేక్షకులను పూర్తి కనెక్ట్ చేయటంలో దర్శకుడు మల్లిక్ రామ్ విజయం సాధించలేదనే చెప్పొచ్చు. ఏ మాత్రం అంచనాలు లేకుండా టైమ్ పాస్ కోసం అయితే అద్భుతం సినిమాపై చూడొచ్చు.