మాదాపూర్ రోడ్లపై 'మెఘా' ఫెరారీ కారు బీభత్సం
ఓ వ్యక్తి మృతి..మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఫెరారీ కారు. కారు నెంబర్ టీఎస్ 08 ఎఫ్ పి 9999. మెఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ పేరు మీద ఉంది. ఈ కారు ఆదివారం నాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ నుంచి అతి వేగంగా వస్తున్న కారు మాదాపుర్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నడుసున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఏసుబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కారు వేగంగా నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏసుబాబు మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా అతని బంధువులు అడ్డుకున్నారు. కారు వేగంగా నడిపి యేసుబాబు మృతికి కారణమైన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో కారును నడిపింది ఎవరు అనే విషయం మాత్రం తెలియరాలేదు.