Telugu Gateway
Politics

ఎన్నికల ర్యాలీలు ప్రారంభించిన ట్రంప్

ఎన్నికల ర్యాలీలు ప్రారంభించిన ట్రంప్
X

కరోనా నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా ఆయన సభల్లో పాల్గొంటున్నారు. ట్రంప్ ఇలా సమావేశాలు నిర్వహించుకోవచ్చంటూ వైట్ హౌస్ వైద్యులు కూడా సర్టిఫై చేసేశారు. దీంతో ఆయన సభలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయింది. తొమ్మిది రోజుల తర్వాత శనివారం రాత్రి ట్రంప్ ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో వందల సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ.. 'నేను ఈ సమయాన్ని గొప్పగా భావిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బయటకు వెళ్లి ఓటు వేయండి' అంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. ర్యాలీకి హాజరైన ట్రంప్‌ మద్దతుదారులు 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అని రాసిన టోపీలను ధరించి హాజరయ్యారు.

వైట్‌హౌస్‌ వైద్యులు ట్రంప్‌ ఆరోగ్యంపై ప్రకటన చేస్తూ వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారని వైట్ హౌస్ డాక్టర్ సియాన్‌‌ కాన్లే తెలిపారు. ఇచ్చిన మందుల వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో రెండో అధ్యక్ష ఎన్నికల డిబేట్‌కు ట్రంప్ 'నో' చెప్పారు. వర్చువల్ పద్దతిలో డిబేట్ కు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది టైమ్ వేస్ట్ కార్యక్రమం అన్నారు. దీంతో అక్టోబర్ 15న జరగాల్సిన ఈ డిబేట్ రద్దయింది. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో చివరిదైన మూడో డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది.

Next Story
Share it