Telugu Gateway
Politics

ఆయన దగ్గుతున్నారు..జో బైడెన్ పై ట్రంప్ విమర్శలు

ఆయన దగ్గుతున్నారు..జో బైడెన్ పై ట్రంప్ విమర్శలు
X

ఈ మాటలు అన్నది ఎవరో ఊహించటం పెద్ద కష్టం కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా కొత్త అథమ స్థాయికి తీసుకెళ్లటానికి ట్రంప్ ఏ మాత్రం వెనకాడటం లేదు. ఓ వైపు కరోనా చికిత్స తీసుకుంటూనే పలుమార్లు మాస్క్ లు తీయటం, అలాగు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి తన అభిమానులకు అభివాదం చేయటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రోగ నిరోధక శక్తి గల అధ్యక్షుడిని అని...డెమాట్రిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్ కు ఏమైందో తెలియదు కానీ..ఆయన దగ్గుతున్నారని ఎధ్దేవా చేశారు. తాను ఇప్పుడు కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని తాను కలిగిఉన్నానని, అయితే ఇది దీర్ఘకాలమా..పరిమిత కాలమా జీవితాంతం ఉంటుందా అనేది తనకు తెలియదన్నారు. వైరస్‌ను దీటుగా ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్పష్టం చేశారు.

తన ప్రత్యర్థి మాదిరి బేస్‌మెంట్‌లో తలదాచుకోని అధ్యక్షుడు మీకున్నారని డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. తన ప్రత్యర్థి జో బిడెన్‌ అస్వస్ధతకు లోనై ఉండవచ్చని ట్రంప్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 1న ట్రంప్‌ కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో మూడు రోజులు గడిపినప్పటి నుంచి జో బిడెన్‌ ప్రచారకర్తలు ఆయనకు నిర్వహించే కరోనా టెస్ట్‌ ల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. అయితే ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం రోజుకో వార్త గుప్పుమంటోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ట్రంప్‌నకు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందా అనే దానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తుది డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది. ఈ నెల 15న జరగాల్సిన డిబేట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it