Telugu Gateway
Cinema

పండగ సినిమాల్లో వసూళ్ల పండగ చేసుకునేది ఎవరు?!

పండగ సినిమాల్లో వసూళ్ల పండగ చేసుకునేది ఎవరు?!
X

ప్రతి పండగకు తెలుగులో సినిమాల పండగ కూడా కామన్. అది సంక్రాంతి అయినా ఉగాది, దసరా ఇలా ప్రతి పెద్ద పండగలను టార్గెట్ చేసుకుని మరీ పెద్ద హీరో ల సినిమాలు ప్లాన్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. క్రిస్మస్ సెలవులకు కూడా భారీ ప్రణాళికలు ఉంటాయి. ఈ సారి కూడా డిసెంబర్ నెలాఖరులో వాయిదా పడిన ప్రభాస్ సలార్ సినిమా కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక దసరా పండగ సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా గురువారం నాడు, రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వర్ రావు లు విడుదల అయ్యాయి. ముందు విడుదల అయిన బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ సినిమా కు తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 32 .33 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సంక్రాంతికి విడుదల అయిన బాలకృష్ణ సినిమా వీరసింహ రెడ్డి తొలిరోజు కలెక్షన్స్ తో పోలిస్తే భగవంత్ కేసరి వసూళ్లు తక్కువగానే ఉన్నట్లు లెక్క. అయితే వీకెండ్, పండగ సెలవుల్లో వసూళ్లు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. రెండవ రోజు ఈ సినిమాకు 18 .79 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తం మీద రెండు రోజులకు ఈ సినెమా 51 .12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది ప్రపంచ వ్యాప్తంగా. గత సినిమాలతో పోలిస్తే భగవంత్ కేసరి లో బాలకృష్ణ ను దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త బిన్నంగా చూపించారు. తనదైన కామెడీ మార్క్ ను పక్కనపెట్టి బాలకృష్ణ తో భావోద్వేగాలు ఉండే కథతో సినిమా తీశాడు.

అదే సమయంలో ఫ్యాన్స్ కు అవసరమైన ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుని విజయం సాధించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ తర్వాత ఎవరి గురించి అయిన మాట్లాడాలి అంటే అది శ్రీలీల గురించే. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త శ్రీలీలకు ప్రేక్షకులకు చూపించాడు. అటు భావోద్వేగాలతో పాటు క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపింది ఈ హీరోయిన్. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ ఒకే ఏడాది రెండు హిట్స్ అందుకోవటమే కాకుండా హ్యాట్రిక్ విజయాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇక మరో కీలక సినిమా రవి తేజ టైగర్ నాగేశ్వర్ రావు. ఈ సినిమాపై అంచనాలు పెంచటంపై చిత్ర యూనిట్ విజయవంతం అయినా...ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయింది అనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది.పేరు మోసిన స్టువర్టుపురం దొంగ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటన పరంగా రవితేజ తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసినా కూడా సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ విఫలం అయ్యారు. దీంతోటి టైగర్ నాగేశ్వర్ రావు సినిమా కూడా రొటీన్ ఫార్ములా సినిమాలాగే మారిపోయింది. స్టోరీ కంటే ఈ సినిమాలో మితిమీరిన హింస ఒక మైనస్ పాయింట్ గా మారింది అని చెప్పాలి. ఈ సంక్రాంతికి విడుదల అయిన వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవి, రవి తేజ కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ దసరాకు విడుదల అయిన టైగర్ నాగేశ్వర్ రావు మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి.

Next Story
Share it