అధికారికంగా ప్రకటించిన విజయ్

టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన విజయదేవరకొండ, పాన్ ఇండియా స్థాయిలో హవా చెలాయిస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వరకు వాళ్ళు ఎక్కడా కూడా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజాగా హీరో విజయదేవరకొండ ఈ విషయాన్ని అధికారికం చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఆయన పెట్టిన పోస్ట్ తో ఈ పెళ్లి ఇప్పుడు అధికారికం అయిపోయింది. తమ విషయంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమకు గుర్తుగా వాళ్ళు పిలుచుకుంటున్నట్లుగానే తమ పెళ్ళికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గా నామకరణం చేస్తున్నట్లు విజయదేవరకొండ వెల్లడించారు. తమపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ ...ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారు అంటూ అభిమానులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 26 న వీళ్లిద్దరి పెళ్లి రాజస్థాన్ లో ఉదయపూర్ లో జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
పెళ్లికి అతి తక్కువ మంది మాత్రమే హాజరుకానున్నారు. రష్మిక, విజయ్ లు వివాహం కోసం సోమవారం ఉదయమే హైదరాబాద్ నుండి ఉదయ్‌పూర్ పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనంతరం టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4, 2026న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. గీత గోవిందం (2018) సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసిన ఈ జంట, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కలిసి నటించారు. ఇప్పటికే టైటిల్ అనౌన్స్ చేసిన ‘రణబాలి’ లో విజయదేవరకొండ, రష్మిక లు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా వీళ్ళ పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెర జంటగా కనిపించిన వీళ్ళు ఇప్పుడు నిజ జీవిత భాగస్వాములుగా మారబోతుండటంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విజయ్, రష్మిక లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని వాళ్ళు ధృవీకరించలేదు. సమయం వచ్చినప్పుడు చెపుతాం అంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు నేరుగా పెళ్లి పీటలు ఎక్కనున్నారు.



