Telugu Gateway
Cinema

ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ రాజీనామాలు అంద‌లేదు

ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ రాజీనామాలు అంద‌లేదు
X

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) నూత‌న ప్రెసిడెంట్ మంచు విష్ణు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లో గెలిచిన అభ్య‌ర్ధుల రాజీనామాలు ఇంకా త‌మ‌కు అంద‌లేద‌న్నారు. రాజీనామాలు చేస్తున్న‌ట్లు తాము మీడియాలోనే చూశామ‌న్నారు. మంచు విష్ణుతో పాటు ఆయ‌న ప్యాన‌ల్ స‌భ్యులు సోమ‌వారం నాడు తిరుమ‌ల‌లో వెంక‌టేశ్వ‌ర‌స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు మోహన్ బాబు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని వీఐపీ దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు 'మా' నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.

త‌ర్వాత మోహన్‌ బాబు మంచు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు 'మా'కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత... గౌరవ ప్రధమైన హోదా అన్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకన్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామన్నారు. మెజారిటీ సభ్యులు తమ ప్యానల్‌ నుంచే గెలిచారని తెలిపారు. ఇక ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ రాజీనామాలపై విష్ణు స్పందిస్తూ.. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పారు. బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ స‌మ‌యంలో తాము అంద‌రిని క‌లుపుకుని పోతామ‌ని ప్ర‌క‌టించారు మంచు విష్ణు.

Next Story
Share it