Telugu Gateway
Cinema

ఇప్పుడు అందరి కళ్ళు రికార్డు లపైనే!

ఇప్పుడు అందరి కళ్ళు రికార్డు లపైనే!
X

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదల తేదీ అధికారికంగా వచ్చేసింది. వాస్తవానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ సమస్యల కారణంగా విడుదలలో జాప్యం అవుతూ వచ్చింది. విజయ్ హీరోగా నటించిన చివరి సినిమా ఇదే కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఎన్నికలకు ముందు సినిమా విడుదల చేస్తే ఫలితాలపై ఈ ప్రభావం ఉంటుంది అనే భయంతోనే సెన్సార్ సమస్యలు సృష్టించినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి జులై 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. మరో కీలక పాత్రలో మమిత బైజు కనిపించనుంది.

పోరాటం ఎంత కఠినంగా ఉంటే...విజయం అంత ఘనంగా ఉంటుంది అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ముఖ్యంగా కోలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరిలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాను తెరకెక్కించారు అని చెపుతున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించగా.. కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కింది. విడుదల తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డు లు నమోదు చేస్తుందో చూడాలి. జన నాయగన్ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. సినిమా నిడివి మూడు గంటల మూడు నిమిషాలుగా ఉంది.

Next Story
Share it