వచ్చే నెలలోనే షూటింగ్

హీరో విజయదేవరకొండ, హీరోయిన్ రష్మిక మీద ఉన్న ప్రచారాలు అన్ని ఇన్ని కావు. నిత్యం వీళ్ళిద్దరిపై ఏదో ఒక వార్త మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే వీళ్లిద్దరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కాంబినేషన్ ఖరారు అయినట్లు కనిపిస్తోంది. విజయదేవరకొండ, రష్మిక ల హ్యాట్రిక్ సినిమా వచ్చే నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించనున్న సినిమాలో విజయదేవరకొండ కు జోడి గా రష్మిక మందన నటించటం ఖరారు అయినట్లు టాలీవుడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి సూపర్ హిట్ సినిమా గీతాగోవిందం తో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించనున్న సినిమా వీళ్లిద్దరి హ్యాట్రిక్ మూవీ అవుతుంది.
ఇది పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయదేవరకొండ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్ డం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధం కావటంతో వచ్చే నెల నుంచి విజయదేవరకొండ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విజయదేవరకొండ, రష్మిక ల హ్యాట్రిక్ మూవీ పై అధికారిక ప్రకటన వస్తే దీనిపై అంచనాలు ఒక రేంజ్ కు వెళతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రాహుల్ సంకృత్యాన్, విజయదేవరకొండ లు కలిసి గతం టాక్సీవాలా మూవీ చేసిన సంగతి తెలిసిందే.