వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ కొట్టిందా?!(Aadarsha Kutumbam Movie Review)

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే దీనిపై అంచనాలు పెరిగాయి. దీనికి తగ్గట్లే సినిమా టైటిల్ కూడా ఆదర్శ కుటుంబం అని పెట్టడం..ఆ తర్వాత వరసగా విడుదల చేసిన కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాకపోతే వరసగా ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడటంతో అదే స్థాయిలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అనుమానాలు కూడా పెరిగాయి. అన్ని అడ్డంకులను దాటుకుని ఆదర్శ కుటుంబం (ఏకె 47 ) మూవీ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న క్రైమ్ కథను ఎంచుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంత మంది సంపన్నుల ఇళ్లలో పనికి చేరి చివరకు ఆయా యజమానులను హత్యలు చేసి ఆస్తులతో పరారు అయిన ఘటనలు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఆదర్శకుటుంభం సినిమా స్టోరీ లైన్ కూడా ఇదే. బీహార్ కు చెందిన ఒక బంది పోటు ముఠా ఇలాగే వరసగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ తెలంగాకు చేరుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే హీరో వెంకటేష్ కు వంద కోట్ల రూపాయల లాటరీ తగులుతుంది.
దీంతో హైదరాబాద్ లో వెంకటేష్ ఫ్యామిలి ఫోటోల ఫ్లెక్సీ లతో హంగామా చేస్తారు. అప్పుడే ఏ కే 47 విల్లా లోకి మారిపోతుంది హీరో ఫ్యామిలి. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ కు చేరుకున్న ఈ గ్యాంగ్ కూడా వంద కోట్లు దోపిడీకి స్కెచ్ వేస్తారు. అందులో భాగంగానే గ్యాంగ్ లోని ఇద్దరిని వెంకటేష్ ఇంట్లో డ్రైవర్ గా..పని మనిషిగా పెడతారు. మరి ఈ గ్యాంగ్ ప్లాన్ వర్క్ అవుట్ అయిందా....హీరో వెంకటేష్ తన ఫ్యామిలీని బందిపోట్ల టీం నుంచి ఎలా కాపాడుకున్నాడు అన్నదే సినిమా. సినిమా కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆదర్శ కుటుంబం జంటగా వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఆకట్టుకుంటారు. ఈ సినిమా మొత్తంలో వెంకటేష్ తర్వాత ప్రేక్షకులను నవ్వించింది అంటే సత్య, రఘుబాబులే. ఒక్క సత్య కామెడీ తప్ప సినిమాలో ఉన్న కామెడీ అంతా టీజర్...ట్రైలర్ లో చూపించటంతో సినిమాలో ప్రేక్షకులకు పెద్దగా సర్ప్రైజ్ లు లేవు అనే చెప్పాలి. సత్య కామెడీలోనే కాస్త కొత్తదనం కనిపిస్తుంది.
హీరో వెంకటేష్ ఒక వైపు మిడిల్ క్లాస్ ఫ్యామిలి మ్యాన్ గా కొద్దిసేపు...తర్వాత రిచ్ ఫ్యామిలి మ్యాన్ గా రెండు వేరియేషన్స్ తో తన పాత్రతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. విలన్ గ్యాంగ్ మాత్రం ఈ సినిమా లో హై లైట్ గా నిలుస్తారు. నారా రోహిత్, రావు రమేష్, బ్రహ్మజీ లు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. మరో పాత్రలో కనిపించిన నివేద పేతురేజ్ పాత్రకు అంత ప్రాధాన్యత ఏమి లేదు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంచుకున్న కథకు కాస్త జోష్ తెచ్చింది థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మంచి రిచ్ గా మూవీ ని తెరకెక్కించింది. దర్శకుడు త్రివిక్రమ్ నుంచి పూర్తిగా ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆదర్శ కుటుంబం సినిమా లో కామెడీ కంటే క్రైమ్ ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇది త్రివిక్రమ్ నుంచి వచ్చిన టైం పాస్ మూవీగా ఇది నిలిచిపోతుంది.
రేటింగ్ : 2 .75 /5



