ఆదిపురుష్ టీజర్ పై భారీ ఎత్తున ట్రోలింగ్!

ప్రభాస్ అభిమానులకు షాక్. రాధేశ్యామ్ పరాజయం తర్వాత ప్రభాస్ తోపాటు ఆయన అభిమానులు కూడా ఆదిపురుష్, సాలార్ సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు తొలుత మంచి ఆదరణ దక్కింది. ప్రశంసలు వచ్చాయి. కానీ కాలం గడిచే కొద్దీ వ్యవహారం రివర్స్ అవుతూ వచ్చింది. ఆదిపురుష్ టీజర్ లో ఎక్కువ భాగం సీన్ బై సీన్ కాపీ అంటూ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. దీనికి పక్కాగా ఆధారాలు చూపిస్తూ మరీ విమర్శలు చేస్తుండటంతో చిత్ర యూనిట్ చిక్కుల్లో పడినట్లు అయింది. ఎక్కువ భాగం హాలీవుడ్ సినిమాల నుంచి కొన్ని తెలుగు సినిమాల నుంచి కూడా సీన్లు కాపీ కొట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దీంతో సినిమా దర్శకుడు ఓం రౌత్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో దర్శకుడు రాజమౌళి సినిమాలపై కూడా కాపీ విమర్శలు వచ్చాయి. కాకపోతే ఈ సారి ఆదిపురుష్ విషయంలో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే..రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. సీతగా కృతి సనన్ కన్పించనున్నారు. అంతే కాదు..ఈ సినిమాలో గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు రావటంతో ఎన్ వై విఎఫ్ ఎక్స్ వాలాపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంస్థ ఈ సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని..తాము దీని కోసం పని చేయలేదని వివరణ ఇచ్చుకుంది. ఇలా పలు అంశాల పరంగా ఆదిపురుష్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.