తెలుగు సినిమా గొప్పతనం..కె విశ్వనాధ్

'ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం.Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాఠాలకి ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir' ఇదీ దర్శకుడు రాజమౌళి స్పందన. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించి తనకంటూ ఒక ప్రత్యేక మైన ముద్ర వేసుకున్న వ్యక్తి. దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు కె.విశ్వనాధ్ స్వగ్రామం 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కె విశ్వనాధ్ మద్రాస్‌లోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారు.
సుడిగుండాలు చిత్రానికి స్ర్కీన్‌ప్లే అందించిన ఆయన 'ఆత్మగౌరవం' సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయితగా, దర్శకుడిగా, ఆడియోగ్రాఫర్‌గా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా ఆయన పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగర సంగమం, శ్రుతిలయలు, స్వయంకృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, ఓ సీత కథ; జీవన జ్యోతి, శుభలేఖ, అపద్భాందవుడు లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులోనే కాకుండా హిందీలో పదికి పైగా చిత్రాలను తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా కీలక పాత్రలు పోషించి మెప్పించారు. కలిసుందాం రా, ఠాగూర్, నరసింహనాయుడు, నువ్వులేక నేనులేను. లక్ష్మీనరసింహ, స్వరాభిషేకం వంటి చిత్రాలు నటుడిగా ఆయనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. విశ్వనాధ్ మరణంతో టాలీవుడ్ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయింది.