చివర్లో వచ్చి ముందుకు...ముందు వచ్చి వెనక్కి!
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసిన మూడు సంక్రాంతి సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో ఫస్ట్ గేమ్ ఛేంజర్ జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వస్తే ...జనవరి 12 న బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ విడుదల అయింది. మూడవ సినిమా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు సినిమాల్లో దర్శకుడి పరంగా చూస్తే శంకర్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. దీనికి ప్రధాన కారణం గతంలో అయన తీసిన సంచలన సినిమాలే. మరో వైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన సినిమా కావటం ...నిర్మాత దిల్ రాజు..భారీ బడ్జెట్ అంటూ లెక్కలు చాలానే చెప్పారు గేమ్ ఛేంజర్ విషయంలో. మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావటంతో ఇప్పుడు అసలు సిసలు సంక్రాంతి విన్నర్ ఎవరు అన్న చర్చ తెరమీదకు రావటం ఖాయం.
విచిత్రం ఏమిటి అంటే ఈ సంక్రాంతి సీజన్ లో విడుదల అయిన మూడు సినిమాల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ విడుదల అయిన గేమ్ ఛేంజర్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తే...ఏ ప్లేస్ లో విడుదల అయిందో బాలకృష్ణ డాకుమహారాజ్ ఆ ప్లేస్ లోనే నిలిచింది. అంటే ఈ సంక్రాంతి సినిమాల విషయంలో బాలకృష్ణ మూవీ రెండవ ప్లేస్ లో ఉంది. విచిత్రంగా అందరి కంటే చివరిగా సంక్రాంతి రోజు అంటే జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటంతో పండగ సినిమాల్లో వెంకటేష్ మూవీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనే చెప్పాలి. అయితే రెండవ ప్లేస్ లో నిలిచిన డాకుమహారాజ్ మాత్రం యాక్షన్ ప్రేమికుల సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ దుమ్ము రేపగా...థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డాకు మహారాజ్ ను ఒక రేంజ్ లో నిలిపింది.
దర్శకుడు బాబీ కొల్లి రొటీన్ కథనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. బాలకృష్ణ యాక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ గా నిలిచాయి. వాస్తవానికి శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. దీంతో సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ మూవీ చివరకు మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కథలో ఏ మాత్రం నూతనత్వం లేకపోవటమే. రామ్ చరణ్, ఎస్ జె సూర్యల నటన బాగున్నా ఇవేమీ సినిమాను కాపాడలేకపోయాయి. ఈ సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాల్లో అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం లను నిర్మించింది దిల్ రాజే. దీంతో దిల్ రాజు ను ఇప్పుడు సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంక్రాంతికి వస్తున్నాం కాపాడే అవకాశం ఉంది.