అల్లు అర్జున్ తప్పు చేస్తే పరిశ్రమ మొత్తాన్ని శిక్షిస్తారా?!
పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్ లో దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి అనే చరణం ఎందుకు పెట్టారో తెలియదు కానీ...ఈ సినిమా కారణంగా టాలీవుడ్ కు మాత్రం పెద్ద దెబ్బే పడింది. ఇప్పుడు అందరూ కలిసి ఈ దెబ్బ నుంచి ఎలా బయటపడాలా అన్న టెన్షన్ లో పడ్డారు. ఇందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి రావటంతో పరిశ్రమల పెద్దల సమావేశం త్వరలోనే జరిగే అవకాశం ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందరూ కలిసి టాలీవుడ్ తరపున తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటనలో పోలీస్ లు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పన్నెండు గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిశ్రమకు చెందిన పలువురు ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
ఇది పరోక్షంగా అల్లు అర్జున్ అరెస్ట్ తప్పు అన్నట్లు పరిశ్రమ స్పందించినట్లు అయింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకుండా టాలీవుడ్ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లటంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్ కు ...తెలంగాణ సర్కారుకు గ్యాప్ మరింత పెరిగినట్లు అయింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణ లో బెనిఫిట్ షోస్ తో పాటు కొత్త సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదు అని ప్రకటించారు. ఈ ప్రకటన టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు హీరో లను షాక్ కు గురిచేసింది. అయితే రేవంత్ రెడ్డి ప్రకటనపై ప్రేక్షకుల తో పాటు వివిధ వర్గాల నుంచి మాత్రం సానుకూల స్పందన వ్యక్తం అయింది. దీంతో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి బెనిఫిట్ షో లు, టికెట్ రేట్ల పెంపు వంటి వాటి విషయంలో వెనక్కు వెళ్లే అవకాశం లేదు. మరి ఇప్పుడు మద్యే మార్గంగా ఉన్న పరిష్కారం ఏంటి అన్న అంశం తెరమీదకు వచ్చింది. అందులో భాగంగానే కొత్త సినిమా ల విడుదల సమయంలో ప్రస్తుతం ఉన్న నాలుగు షో లు కాకుండా..అదనంగా ఒక షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
అది కూడా టాలీవుడ్ ప్రభుత్వానికి సారీ చెప్పిన తర్వాత మాత్రమే. అల్లు అర్జున్ తప్పు చేశారు అని ..పరిశ్రమ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అని..ఈ పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి ఉంటారు కాబట్టి సానుకూలంగా స్పందించాలి అని సీఎం ను పరిశ్రమ ప్రతినిధులు కోరటానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి సినిమా ల విషయంలో కూడా తొలి వారం రోజుల పాటు లేదా మూడు, నాలుగు రోజులు ఐదు షో లకు అనుమతి మంజూరు చేయటానికి ఛాన్స్ ఉంది అని సమాచారం. ఇదే సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు ఇవ్వబోయే రిలీఫ్ అన్నది పరిశ్రమ వర్గాల్లో ఉన్న చర్చ. ఇంతకు మించి ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు పెద్దగా ఇతర మినహాయింపులు ఉండకపోవచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి.