Telugu Gateway
Cinema

టాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్

టాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
X

చివ‌ర‌కు ఇలా ప్ర‌చారం చేసుకుంటున్నారు!

అతి ఎక్క‌డైనా అన‌ర్ధ‌మే. టాలీవుడ్ కు ఇప్పుడు ఈ విష‌యం బాగా అర్ధం అయిన‌ట్లు ఉంది. దొరికిన వాళ్ళ‌ను దొరికినంత మేర పిండుకుందామ‌ని ప్లాన్ చేశారు. కొన్ని పెద్ద సినిమాలు న‌డిచిపోయాయి. కానీ అస‌లు సీన్ ఆ త‌ర్వాతే మొదలైంది. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా..మెగా ప‌వ‌ర్ స్టార్ అయినా స‌రే మేం చూడం అన్నారు ఆచార్య సినిమా విష‌యంలో. అస‌లే సినిమా అంతంత మాత్రం..పైగా టిక్కెట్ రేట్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో సినీ అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతే త‌మ షాక్ ఎలా ఉంటుందో చూపించారు..చూపిస్తున్నారు కూడా. ఎఫ్‌3 చిత్ర యూనిట్ కూడా ముందే ప్ర‌మాదాన్ని ప‌సిగట్టి తాము పాత రే్ట్ల‌తోనే సినిమా చూపిస్తున్నామ‌ని..రేట్లు పెంచ‌టం లేద‌ని ప్ర‌త్యేకంగా ప్ర‌చారం చేసుకోవాల్సి వ‌చ్చింది. దిల్ రాజు తాము రేట్లు పెంచ‌టం లేద‌ని చెప్పినా హైద‌రాబాద్ ఐమ్యాక్స్ లో టిక్కెట్ ధ‌ర 295 రూపాయ‌లు ఉంది. అంటే అద‌నంగా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఇచ్చే ధ‌ర తీసుకోలేదు త‌ప్ప‌..పాత రేట్ల‌ను అలాగే కొన‌సాగించారు అన్న విష‌యం టిక్కెట్ కొన్న వాళ్ల‌కు మాత్ర‌మే తెలుస్తుంది.

కొద్ది రోజుల క్రితం ఐమ్యాక్స్ టిక్కెట్ ధ‌ర 150 రూపాయ‌లు ఉండ‌గా..అఖండ‌, పుష్ప2 సినిమాల స‌మ‌యంలో దాన్ని 200 రూపాయ‌ల‌కు పెంచారు. అది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఏకంగా 295 రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్ 2 వంటి సినిమాలు అయితే ఇంకా అద‌నంగా వ‌సూలు చేశాయి. ఇప్పుడు మేజ‌ర్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ధ‌ర‌లపై చివ‌ర‌కు ఇలా ప్ర‌చారం చేసుకుంటోంది. కరోనా త‌ర్వాత ఇంత త‌క్కువ ధ‌ర టిక్కెట్ల‌తో ఏ సినిమా రాలేద‌ని చెబుతోంది. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్స్ లో150 రూపాయ‌లు, మ‌ల్టీప్లెక్స్ ల్లో అయితే 195 రూపాయ‌లు, ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో 147 రూపాయ‌లు, మ‌ల్టీప్లెక్స్ ల్లో 177 రూపాయ‌లు అని తెలిపారు. ఈ సినిమా జూన్ 3న విడుద‌ల అవుతుంది. అడ‌వి శేష్ న‌టించిన ఈ సినిమాకు మ‌హేష్ బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Next Story
Share it