పోయేది జనం డబ్బేగా?!

పోతే పోయేది జనం డబ్బే కదా. మనకు ఏమి పోతుంది లే అనుకున్నట్లు ఉన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు. వీళ్ళ తాజా నిర్ణయం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. తెలుగు సినిమా లకు భారీ బడ్జెట్ అనో...లేక ఏపీలో రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పో ఎప్పటికప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా వాళ్ళ వైపే మొగ్గుచూపుతూ వస్తోంది. ఇక నుంచి అసలు తెలంగాణ లో టికెట్ రేట్ల పెంపు ఉండదు అని అసెంబ్లీ లో చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివర్స్ గేర్ వేసి రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. అభ్యంతరాలు ఉన్నా తెలుగు స్ట్రెయిట్ సినిమా లకు టికెట్ రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు అంటే కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏపీలో ఏకంగా రెండు డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వటం దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తమ సొంత ఇమేజ్ ల కోసం జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఆగస్ట్ 14 న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి కూలీ అయితే రెండవది వార్ 2 . కూలీ లో హీరో రజనీ కాంత్ అయితే...ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్, నిర్మాత అంతా తమిళవాళ్లే. వార్ 2 పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నిర్మాత, డైరెక్టర్ బాలీవుడ్ వాళ్లే. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు డబ్బింగ్ సినిమా లకు కూడా అనుమతి ఇవ్వటం ద్వారా కొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణాలో మాత్రం ఈ రెండు సినిమాలకు ఎలాంటి రేట్స్ హైక్ లేదు. కానీ ఏపీ సర్కారు మాత్రం రెండు సినిమాల రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి కూలీ ఒరిజినల్ తమిళ్ సినిమా. కానీ తమిళ్ నాడు కంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో ఈ సినిమా కు టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వార్ 2 సినిమా కు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు...మల్టీఫెక్స్ ల్లో 100 రూపాయలు రేట్లు అదనంగా పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు.
వీటితో పాటు వార్ 2 అదనపు షో టికెట్ ధర మాత్రం 500 రూపాయలు నిర్ణయించారు. కూలీ సినిమాకు ఇవే రేట్ల పెంపు ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 స్పెషల్ షో రేట్లు ప్రత్యేకంగా 500 రూపాయలకు అనుమతి ఇచ్చారు. దీని వెనక కూడా వేరే కారణాలు ఉన్నాయి అని చెపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమాకు ప్రముఖ నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. నాగ వంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు వ్యాపార భాగస్వాములు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఎంత సన్నిహితుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కాంబినేషన్ లోనే స్పెషల్ షో కు స్పెషల్ రేట్లు వచ్చాయి అనే చర్చ కూడా టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది.



