Telugu Gateway
Cinema

దేవర రికార్డులపై అందరిలో ఆసక్తి !

దేవర రికార్డులపై అందరిలో  ఆసక్తి !
X

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా దేవర. దగ్గర దగ్గర నెల రోజుల ముందు నుంచే దేవర సినిమా హంగామా మొదలైంది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే ఏ భారతీయ సినిమా సాధించని రికార్డు ఎన్టీఆర్ దేవర సాధించింది. ప్రీ సేల్స్ లోనే ఇప్పటివరకు రెండు మిలియన్ డాలర్ల వసూళ్ల దగ్గరకు చేరుకున్నట్లు టాక్. ఇప్పటికే విడుదల అయిన దేవర సాంగ్స్ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఆదివారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరో ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా కీలక నగరాల్లో పర్యటించి ప్రమోషన్స్ నిర్వహించారు. దేవర సినిమాలో చివరి నలభై నిమిషాలు ఒక రేంజ్ లో ఉంటుంది ఎన్టీఆర్ వెల్లడించటంతో ఆయన ఫ్యాన్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

దేవర సినిమా ట్రైలర్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. కొంత మంది సోషల్ మీడియా లో దర్శకుడు కొరటాల శివ గత సినిమా ఆచార్య ను తెరమీదకు తెచ్చి నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నా ఇవేమి పెద్దగా వర్క్ అవుట్ అవుతున్న దాఖలాలు లేవు. అయితే దేవర సినిమా విషయంలో అటు దర్శకుడు కొరటాల శివ, ఇటు ఎన్టీఆర్ లకు టెన్షన్ మాత్రం తప్పదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఫలితం వాళ్ళ భవిష్యత్ ప్రాజెక్ట్ లపై ఉంటుంది కాబట్టి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దేవర సినిమా కు రిలీజ్ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల షో తో పాటు టికెట్ రేట్ల పెంపునకు కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ లో ఇంకా దీనికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న దేవర కూడా అదే తరహాలో హిట్ కొడుతోంది అనే ధీమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.

Next Story
Share it