నాని..శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ హిట్ కొట్టిందా?!(The Paradise Movie Review)

హీరో నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న నమ్మకం ఉండేది ప్రేక్షకులకు. గత కొంత కాలంగా తన సహజమైన స్టైల్ కు భిన్నంగా మాస్ ఇమేజ్ కోసం దసరా, సరిపోదా శనివారం వంటి సినిమాలు చేశాడు. ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని దక్కించుకున్నాయి. దసరా మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో తెరకెక్కటంతో ఈ ప్యారడైజ్ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. వీటికి తోడు ఈ మూవీ నుంచి విడుదల అయిన ఆయా షేర్, ఏష నాగుల పాటలు దుమ్మురేపటంతో అటు ప్రీమియర్ షోస్ తో పాటు రెగ్యులర్ షోస్ కు కూడా మంచి బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా టీజర్ తో పాటు ప్రమోషన్స్ లోనూ ఈ మూవీ అంతా సవారీలు అనే ఒక జాతి గుర్తింపు కోసం చేసిన పోరాటం అనే విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్. కొద్ది నెలల క్రితం విడుదల అయిన రామ్ చరణ్ పెద్ది మూవీ ఒక గ్రామం గుర్తింపు కోసం చేసిన పోరాటం అయితే...ప్యారడైజ్ మూవీ కష్టపడే మనుషులకు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం గుర్తింపు దక్కనందుకు ఒక జాతి చేసే పోరాటం.
ప్యారడైజ్ ప్రాంతంలో ఉండే దొరల కుటుంబాలు వీళ్లకు అక్కడ కనీసం విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు అందకుండా చేస్తూ ఉంటారు. ఈ రాజరిక ఫ్యామిలీ పాత్రలో శిఖంజా మాలిక్ గా మోహన్ బాబు, ఆయన కొడుకుగా రాఘవ్ జుయల్ కనిపిస్తారు. సవారీలకు తన కొడుకు నాయకత్వం వహించి ఈ ప్రాంతానికి గుర్తింపు తేవాలని జడల్ తల్లి కోరుకుంటుంది. కానీ తన తల్లిపై ఉన్న వ్యతిరేకత కారణంతో తొలుత హీరో ఈ విషయంలో ఏ మాత్రం ఆసక్తి చూపించడు. తర్వాత మనసు మార్చుకుని జడల్ ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ప్యారడైజ్ కు గుర్తింపు దక్కిందా లేదా అన్నదే మూవీ. మాస్ ఇమేజ్ కోసం చేసే పోరాటంలో హీరో నాని అసలు ఈ సినిమా ఎలా వెళుతుందో ఏ మాత్రం దృష్టిపెట్టినట్లు కనిపించలేదు అనే చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇందులో వావ్ మూమెంట్ ఒక్కటి కూడా లేదు. చిత్ర యూనిట్ పదే పదే చెప్పుకున్న తల్లీ, కొడుకుల సెంటిమెంట్ విషయం కూడా ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించదు.
హీరో నాని..హీరోయిన్ కయాదు లోహర్ లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక సినిమాలో హింస అయితే బహుశా తెలుగు సినిమాలో చరిత్రలో నాని ఒక కొత్త రికార్డు నమోదు చేశాడు అనే చెప్పొచ్చు. అంతలా ఉన్నాయి ఈ మూవీ లో హింసాత్మక సన్నివేశాలు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోగా ...పోనీ కథనం అయినా ఆసక్తికరంగా సాగిందా అంటే దగ్గర దగ్గర మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందా అని ప్రేక్షకులు టైం చూసుకోవాల్సిన పరిస్థితి.ఈ సినిమా క్లైమాక్స్ లో ప్యారడైజ్ ప్రాంతానికి గుర్తింపు ఇప్పించే బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే పాత్రలో ప్రియదర్శి ఎంట్రీ ఇస్తాడు. అచ్చం మాజీ సీఎం కెసిఆర్ హావభావాలతో పాటు అవే తరహా డైలాగులు చెపుతూ ఆకట్టుకుంటాడు. సంపూర్ణేష్ బాబుకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా కూడా బిర్యానీ పాత్ర ప్రభావం సినిమాపై ఏమి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారీ అంచనాలతో విడుదల అయిన ప్యారడైజ్ మూవీ ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది.
రేటింగ్: 2 /5



