నాని కెరీర్ లోనే అత్యధికం

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కిన ప్యారడైజ్ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బుధవారం రాత్రి ప్రీమియర్ షోస్ కూడా వేసిన సంగతి తెలిసిందే. అన్నీ కలుపుకుని ప్యారడైజ్ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 88 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు వసూళ్ల నంబర్ తో న్యూ లుక్ ను విడుదల చేసింది. నాని కెరీర్ లో ఒక సినిమాకు ఇంత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావటం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. నాని కెరీర్ లోనే మొత్తం ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలు నాలుగు ఉన్నాయి. ఈ జాబితాలో హిట్ 3 తో పాటు దసరా, సరిపోదా శనివారం, ఈగ ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ గా హిట్ 3 నే ఉంది.
ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు రికార్డు లు చెపుతున్నాయి. తాజాగా విడుదల అయిన ప్యారడైజ్ మూవీ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇది కొత్త కొత్త రికార్డు లు నమోదు చేసేది. కానీ ఈ మూవీ లోని మితి మీరిన హింస...కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటం తదితర అంశాలతో ప్రీమియర్స్ నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ ప్రభావం రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్స్ పై పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇతర కీలక సినిమాలు ఏవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లేకపోవటంతో ఈ వీకెండ్ వరకు ప్యారడైజ్ మూవీ కలెక్షన్స్ ఒక మోస్తరుగా ఉండటం ఖాయం అని చెప్పొచ్చు. గతంలో ఏ నాని సినిమాకు రాని స్థాయిలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ ఈ సినిమా ఎంత మేర వసూళ్లు సాధిస్తుంది అన్నది ఇప్పుడు కీలకం కానుంది.



