Telugu Gateway
Cinema

శిఖరం ఎక్కిన తెలుగు సినిమా

శిఖరం ఎక్కిన తెలుగు సినిమా
X

ప్రపంచంలో సినిమాలకు ఏదైనా టాప్ అవార్డు ఉంది అంటే అది ఆస్కార్ మాత్రమే. అలాంటి ఆస్కార్ అవార్డు కూడా ఇప్పుడు తెలుగు సినిమా గడప తొక్కి...ఇంట్లోకి వచ్చేసింది. భారతీయ సినిమాలకు గతంలో కొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి.. అయితే తెలుగు సినిమాకు ఇది తొలిసారి కావటం విశేషం. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా అందుకుని మరో సంచలనం నమోదు చేసింది. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదో అనటం పొరపాటు అవుతుంది. దర్శకుడు రాజమౌళి దగ్గరనుంచి పాట రాసిన చంద్రబోస్, సంగీతం సమకూర్చిన కీరవాణి, పాట పాడిన రాహుల్ సింప్లిగంజ్, కాల భైరవ, కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్..అంతిమంగా నాటు నాటు పాటకు దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేసిన ఎన్టీఆర్, రాంచరణ్ లది. అందరు ఇందులో భాగమే.

ఈ అవార్డులో ప్రతి ఒక్కరికి వాటా ఉన్నట్లే లెక్క. ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాను అందించిన నిర్మాత డీ వీ వీ దానయ్య కూడా కీలక వాటాదారే. విమర్శలు ఎన్ని ఉన్నా తెలుగు సినిమా ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు దర్శకుడు అంటే ఖచ్చితంగా రాజమౌళి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా బాహుబలి సినిమా రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ సినిమాల ద్వారా తెలుగు సినిమాను భారతీయ సినిమాగా మార్చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా రావటంతో తెలుగు సినిమా ప్రపంచ సినీ చరిత్ర లో కొత్త అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావటం తో చిత్ర యూనిట్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story
Share it