ఇది సూపర్..మెగా..బాహుబలి బెగ్గింగ్

జగన్ వీరిని మించిన మహాబల్ అంటూ సంచలన వ్యాఖ్యలు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కు చెందిన హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాష్. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు గురువారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం అయి టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు పలు అంశాలపై చర్చించారు. సీఎం జగన్ తో బేటీ అనంతరం సమస్యకు త్వరలోనే శుభంకార్డు పడుతుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్లు చేశారు. ఇది జరిగింది అంటే సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ (అడుక్కోవటం) కారణంగానే అన్నమాట అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో జగన్ ను ఆయన ఒమెగా స్టార్ గా అభివర్ణించారు. వైఎస్ జగన్ సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబల్ అంటూ పేర్కొన్నారు. తన ట్వీట్ కు జతగా సాక్షి టీవీ వీడియో క్లిప్ ను జత చేశారు. అందులో చిరంజీవి తాజా భేటీలో జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన వీడియో కూడా ఉంది.
మా అభిప్రాయాలు తీసుకోవటానికి తొలుత నన్ను ఆహ్వానించారు..తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మీరు తీసుకునే నిర్ణయాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం..పేదల అనుకూల ప్రభుత్వం మీది అంటూ ప్రశంసలు కురిపించారు. పేద ప్రజానికానికి ఏదైనా అందుబాటులో ఉండాలి అనే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ అదే సమయంలో పరిశ్రమ లో కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి పరిశ్రమలో పెరుగుతున్న ఖర్చులను దష్ట్యా..అదే రిటర్న్స్ ఉంటే బాగుంటుంది అనే సదుద్దేశంతో..మీ అభిప్రాయాలు.ప్రజలకు ఇచ్చిన మాటను గుర్తుంచుకుని..ఉభయులకు ఉపయోగపడేలా మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవటం బాగుంది. ఈ ఫిగర్స్ వచ్చాక చాలా సంతోషించాం..పరిశ్రమకు వెసులుబాటు..ఇందులో ఎవరూ విభేదించేది కూడా ఏమీలేదు అంటూ చిరంజీవి చెబుతున్న మాటలు ఉన్నాయి.