Telugu Gateway
Cinema

మిరాయి కొత్త కలెక్షన్ల రికార్డు లు సాధిస్తుందా?!(MIRAI Movie Review in Telugu)

మిరాయి కొత్త  కలెక్షన్ల రికార్డు లు సాధిస్తుందా?!(MIRAI Movie Review in Telugu)
X

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి హనుమాన్ సినిమాతో ఎలా అదరగొట్టాడో.. ఇప్పుడు మిరాయి తో కూడా అదే పని చేశాడు తేజా సజ్జ. కాకపోతే ముందు మిరాయి సినిమాపై కూడా తొలుత అంచనాలు ఏమీ లేకపోయినా ఎప్పుడైతే ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాయో అప్పుడు ఈ మూవీ పై కూడా అంచనాలు ఒక రేంజ్ కు పెరిగాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా ఈ మిరాయి సినిమాతో టాప్ డైరెక్టర్ ల సరసన చేరతాడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. భారీ సినిమాలతో పోలిస్తే ఎంతో తక్కువ బడ్జెట్ తో ఇంత క్వాలిటీ ఔట్ పుట్ ఎలా ఇవ్వగలిగారు అన్నదే ఇప్పుడు అటు ప్రేక్షకుల తో పాటు టాలీవుడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన అంశం. భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటు తేజ సజ్జా తో పాటు మంచు మనోజ్ కు మంచి హిట్ ఇచ్చింది అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో తేజా సజ్జా, మంచు మనోజ్ లు ఇద్దరూ దుమ్మురేపారు.

ఈ సినిమా చూసిన వాళ్లకు కొన్ని సార్లు మంచు మనోజ్ తన నటన...డైలాగులతో హీరో తేజా సజ్జా ను డామినేట్ చేశాడు అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. కాకపోతే యాక్షన్ సన్నివేశాల్లో తేజా సజ్జా శ్రమ కూడా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కథ అంతా కూడా తొమ్మిది పుస్తకాల చుట్టూ తిరుగుతుంది అని చిత్ర యూనిట్ ఎప్పటి నుంచో చెపుతూ వస్తోంది. మొత్తం తొమ్మిది పుస్తకాలు..తొమ్మిది మంది యోధుల చేతుల్లోకి వెళతాయి. అయితే వీటి అన్నిటిని దక్కించుకుని అమరత్వాన్ని సాధించటమే కాకుండా..ప్రపంచాన్ని శాసించాలని కలలు కంటాడు మంచు మనోజ్. ఇందుకు అత్యంత కీలకం అయింది తొమ్మిదో పుస్తకం. అయితే ఇది హీరో తేజా సజ్జా తల్లిగా నటించిన శ్రియా దగ్గర ఉంటుంది. తన కొడుకును ఆమె చిన్నప్పుడే దూరం చేసుకుంటుంది. మరి హీరో తల్లి దగ్గరికి చేరి...ఎలా ఈ తొమ్మిదవ పుస్తకాన్ని కాపాడాడు. అతనికి మిరాయి అస్త్రం ఎలా ఉపయోగపడింది అన్నదే ఈ మూవీ. రాముడి కోదండాన్ని మిరాయి అస్త్రంగా వాడటం...మధ్యలో తల్లి సెంటిమెంట్ వంటి అంశాలతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సఫలీకృతుడు అయ్యాడు.

అక్కడక్కడా కొంత ల్యాగ్ ఉన్నా కూడా మొత్తం మీద ప్రేక్షకుల ను ఈ మూవీ ఆకట్టుకుంటుంది. వేద పాత్రలో తేజా సజ్జా రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడు. ఫస్ట్ రొటీన్ అల్లరి గ్యాంగ్ గా..తర్వాత అసలైన యోధుడిగా రూపాంతరం చెందుతాడు. ఈ రెండు రోల్స్ లోనూ తన యాక్షన్ తో మంచి వైవిధ్యం చూపించాడు. హీరోయిన్ రితిక్ నాయక్ హీరో ను యోధగా మార్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహావీర్ లామా గా మంచు మనోజ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో జగపతిబాబు, జయరాం ల పాత్రల పరిధి తక్కువే అయినా కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది తేజా సజ్జా, మంచు మనోజ్ ల యాక్షన్ తో పాటు అత్యంత కీలకం అయింది వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఈ మూవీ ని ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. గౌర హరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా మిరాయి విజయంలో కీలక పాత్ర ఉంది అనే చెప్పాలి. హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 290 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరి ఇప్పుడు ఈ మిరాయి మూవీ ఎన్ని కొత్త రికార్డు లను బ్రేక్ చేస్తుందో చూడాలి.

రేటింగ్: 3 .5 /5

Next Story
Share it