ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ మూవీ హిట్ అయిందా?!(Srinivasa Mangapuram Review)

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారి గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం సినిమా ప్రకటించటంతో ఈ మూవీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా నటించింది. ఇవి అన్నీ కూడా సినిమాపై బజ్ పెంచటానికి బాగానే ఉపయోగపడ్డాయి. శ్రీనివాసమంగాపురం మూవీ గురువారం నాడే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగా ఏ కొత్త హీరో లాంచింగ్ కు అయినా ప్రేమ కథనే ఎంచుకుంటారు. ఇప్పుడు జయకృష్ణ విషయంలో కూడా అదే జరిగింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు అన్ని అజయ్ భూపతే చూశారు. అయితే టాలీవుడ్ లో సినిమాల పరంగా ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న యువ హీరో ను లాంచ్ చేసేందుకు ఆయన పెద్దగా కొత్తదనం లేని ప్రేమ కథనే ఎనుచుకున్నారు.
ఎందుకంటే శ్రీనివాస మంగాపురం సినిమా చూస్తే ఈ సినిమాలో ప్రేమ కథ గతంలో ఎన్నో సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా పెద్దగా పండలేదు. పైగా అటు హీరో..ఇటు హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే కావటంతో నటన పరంగా కూడా పెద్దగా చెప్పుకోవటానికి ఏమీలేదు. కథ అంతా తిరుపతి..చిత్తూర్ జిల్లా తో పాటు బళ్లారి చుట్టూనే తిరుగుతుంది. ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఉన్నా కూడా అది కూడా పెద్దగా ఆసక్తి కలిగించలేకపోతుంది. ప్రేక్షకుల ఊహకు అందేలా...గతంలో ఎన్నో సినిమాల్లో చూసినట్లే ఉండటంతో ఎక్కడా కూడా ఈ మూవీ లో జోష్ కనిపించదు. ఈ సినిమాలో ఉండటానికి భారీ తారాగణమే ఉంది.
సీనియర్ నటుడు మోహన్ బాబు తో పాటు నరేష్, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్ లు ఉన్నారు. సహజంగా మంచి పాత్ర దక్కాలే నరేష్ తన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ ఈ సినిమాలో నరేష్ పాత్ర ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. మోహన్ బాబు, శ్యామ్ పాత్రల్లో కూడా అంత బలం లేదు. ఇక హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే ఇదే తొలిసినిమా కాబట్టి వీళ్లపై పెద్దగా అంచనాలు ఎవరికీ ఉండవు. కాకపోతే ఈ ప్రేమ కథలో కొత్తదనం లేకపోవటంతో అటు కీలక నటీనటుల యాక్షన్ లేక...కథలో కొత్తదనం ఏమి లేక సినిమా మొత్తం తేలిపోయినట్లు అవుతుంది. ఓవరాల్ గా చూస్తే దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా పై తన మార్క్ చూపించలేకపోయారు. దీంతో ఇది సాదా సీదా మరో రొటీన్ ప్రేమ కథ మూవీ గా మిగిలిపోతుంది.



