దుబాయ్ టూర్ అసలు కారణం ఇదీ
ఎన్టీఆర్ అసలు దుబాయ్ ఎందుకు వెళ్లారు. ఫ్యామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ అంటూ సోషల్ మీడియా లో కొంత మంది హంగామా చేశారు. కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ టూర్ ఫ్యామిలీ ట్రిప్ కాదు..ఆయనకు ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలో పాల్గొనటానికి దుబాయ్ వెళ్లారు. అంతే కాదు...ఆర్ఆర్ఆర్ సినిమాలో అయన నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నారు. దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగనుంది. తొలి రోజు అంటే శుక్రవారం నాడు తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన వారు అక్కడ హంగామా చేశారు. ఎన్టీఆర్ శుక్రవారం నాడు ఈ అవార్డు ను అందుకున్నారు. 2023 సంవత్సరంలో ఉత్తమ నటుడు అవార్డు ఎన్టీఆర్ కు దక్కగా..ధమాకా సినిమా కు గాను హీరోయిన్ శ్రీ లీల కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా ఆర్ఆర్ఆర్ సినిమా కు రాజమౌళి అవార్డు దక్కించుకుంటే...ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది.
సైమా అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఒడిదుడుకుల్లో, నేను కిందపడినప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కళ్ళలో నీళ్లు వచ్చినప్పుడు ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభివందనాలు అంటూ ముగించారు. ఇప్పుడు ఈ వీడియో , ఎన్టీఆర్ అవార్డు అందుకున్న ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుత నటన కనపర్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.