దర్శకుడు సంజయ్ జాసన్ తొలి ప్రయత్నం ఫలించిందా?!(Sigma Movie Review)

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా సిగ్మా. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ పై అందరిలో ఆసక్తి పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ మూవీ దర్శకుడే అని చెప్పాలి. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకప్పటి హీరో విజయ్ తనయుడు సంజయ్ జాసన్ ఈ సినిమాకు కథ అందించటంతో పాటు దర్శకత్వం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇవే ఈ సిగ్మా సినిమా కు మంచి హైప్ తెచ్చి పెట్టాయి. సంజయ్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావటంతో సిగ్మా మూవీ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది.ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సందీప్ కిషన్ తన తల్లి ఎంతగానో ప్రేమించిన లైబ్రరీని నడుపుతూ ఉంటాడు. దీని ద్వారా పెద్దగా ఆదాయం కూడా ఏమి రాదు. పాత కథలను వాయిస్ ఓవర్ తో వీడియో లు చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నం చేస్తుంటాడు.
ఒక వైపు తండ్రి చేసిన అప్పుల తిప్పలు...అటు లైబ్రరీ తో పాటు యూట్యూబ్ లో కూడా ఎలాంటి ఆదాయం రాకపోవటంతో రేడియో జాకీ గా పని చేస్తున్న ఫరియా వాయిస్ బాగుంది అని గుర్తించి తన వీడియో లకు వాయిస్ ఓవర్ చెప్పమని కోరతాడు. వచ్చిన డబ్బులో వాటా ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ఆ పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. తన తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు డబ్బులు ఎలా సంపాదించాలా అని ప్రయత్నం చేస్తున్న సమయంలో హీరో కి అనుకోకుండా ఒక కీ దొరుకుంది. ఆ కీ దేనికి సంబంధించినది...తండ్రి చేసిన అప్పులు తీర్చి తన తల్లి గుర్తుగా ఉన్న లైబ్రరీ ని హీరో కాపాడుకోగలిగాడా లేదా అన్నదే సిగ్మా మూవీ. దర్శకుడు సంజయ్ జాసన్ తన ఫస్ట్ సినిమాకు ఒక సింపుల్ కథనే ఎంచుకున్నాడు.అయితే ఇందులో ఎక్కడా కూడా పెద్దగా ఆసక్తికర అంశాలు కనిపించవు.
ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా...కథ, కథనంలో గ్రిప్పింగ్ లేదు. ఉన్నంతలో ఈ మూవీలో హీరో సందీప్ కిషన్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాలో మంచి పాత్రలు దక్కాయి అంటే సంపత్ రాజ్, జాగ్ జేపీకే అని చెప్పాలి. రాజు సుందరం కూడా కీలక పాత్రలో కనిపిస్తాడు. సిగ్మా మూవీ లో విలన్ పాత్రలో కనిపించిన సంపత్ రాజ్ టీం లో ఉండే మగలక్ష్మి సుదర్శనన్ రోల్ ఆకట్టుకుంటుంది. సిగ్మా మూవీ జస్ట్ ఒక రొటీన్ సినిమాగానే మిగిలిపోతుంది తప్ప...దర్శకుడు సంజయ్ జాసన్ కెరీర్ లో ఈ ఫస్ట్ మూవీ కి ప్రత్యేకత ఏమి ఉండదు అనే చెప్పాలి.



