Telugu Gateway
Cinema

కంగనా కు కౌంటర్ గా ఉర్మిళను దింపుతున్న శివసేన!

కంగనా కు కౌంటర్ గా ఉర్మిళను దింపుతున్న శివసేన!
X

ఉర్మిళా మటోండ్కర్ కు శివసేన కోటాలో ఎమ్మెల్సీ పదవి

మహారాష్ట్ర సర్కారుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత కొంత కాలంగా పెద్ద తలనొప్పిగా మారారు. ఆమె ఏకంగా ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే, ఆయన తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రేపై కూడా విమర్శలు గుప్పిస్తోంది. చివరకు ఇది ఎంత వరకూ వెళ్ళింది అంటే అక్రమ నిర్మాణం అని కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతకు కూడా దారితీసింది. దీనిపై కంగనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం..తర్వాత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం కాస్తా డ్రగ్స్ వైపు మళ్ళటం..అక్కడ నుంచి రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి ఉథ్థవ్ ఠాక్రే పేరెత్తకుండానే కంగనాపై ఘాటు విమర్శలు చేశారు. తాజా పరిణామాలను చూస్తుంటే కంగనా రనౌత్ కు కౌంటర్ ఇచ్చేందుకు శివసేన ఒకప్పటి బాలీవుడ్ భామ ఉర్మిళా మటోండ్కర్ ను రంగంలోకి దింపుతున్నట్లు కన్పిస్తోంది.

ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు శివసేన రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. మండలిలో ఖాళీ కానున్న 12 స్థానాల్లో గవర్నర్‌ కోటా కింద కళాకారుల విభాగం నుంచి ఊర్మిళను నామినేట్‌ చేస్తారని చెబుతున్నారు. ముంబయ్ పై కంగనా చేసిన విమర్శలకు ఓ సారి ఊర్మిళ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆమెను కంగనా చాలా తేలిగ్గా తీసిపారేసినట్లు మాట్లాడారు. మరి కంగనా నోటికి తాళం వేయటం ఊర్మిళా మటోండ్కర్ కు సాధ్యం అవుతుందా అంటే వేచిచూడాల్సిందే.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమైన మహా వికాస్‌ ఆఘాడీ నేతలు అభ్యర్ధులపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉర్మిళ మటోండ్కర్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారన్న వార్తలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఊర్మిళను మండలికి నామినేట్‌ చేస్తున్నారనే వార్తలు తాను కూడా విన్నానని...దీనిపై సీఎం ఉథ్థవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. కూటమి నేతలు ఎమ్మెల్సీ పదవులను సమానంగా తీసుకోవటానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కొత్తగా ఎమ్మెల్సీ పదవులు దక్కనున్న వారిలో మరాఠీ నటుడు ఆదేష్‌ బండేకర్‌, సింగర్‌ ఆనంద్‌ షిండేతో పాటు సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకు రాజీనామా చేసిన ఖడ్సే ఇటీవల ఎన్‌సీపీలో చేరారు.

Next Story
Share it