Telugu Gateway
Cinema

శివాజీ కొత్త జోనర్ ప్రయోగం ఫలించిందా?!

శివాజీ కొత్త జోనర్ ప్రయోగం ఫలించిందా?!
X

గత కొంత కాలంగా హీరో శివాజీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హైదరాబాద్ లో ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్ షోస్ వేశారు. శివాజీ తో పాటు ఇందులో హీరోయిన్ గా నటించిన లయ కూడా ఈ తరహా పాత్రలు చేయటం మొదటిసారి అని చెప్పొచ్చు. టైటిల్ కామెడీగా ఉన్నా కూడా సినిమా మాత్రం క్రైమ్ ..సస్పెన్స్ థ్రిల్లర్. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సినిమా కథ అంతా ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. అదే శివాజీ, లయ, రోహన్ లతో కూడిన ఫ్యామిలి. శివాజీ పంచాయతీ సెక్రటరీ గా పనిచేస్తూ నిజాయతీగా ఉంటాడు. కానీ భార్య మాత్రం డబ్బులు సంపాదించి...నగలు కొనాలని..రకరకాలుగా భర్తపై ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ కొడుకు రోహన్ అయితే మోస్ట్ వయలెంట్ గా అందరిపై దాడులు చేస్తూ...రీల్స్ చేస్తుంటాడు. అటు భార్య లయ, కొడుకు రోహన్ చేసే రచ్చ భరించటం కష్టంగా ఉంటుంది శివాజీకి.

ఒక రోజు అనుకోకుండా శివాజీ కొడుకు రోహన్ తమ ఇంటికి వచ్చిన ఎస్ఐ దగ్గర చూస్తానని గన్ తీసుకుని కాలుస్తాడు. దీంతో ఆ ఎస్ఐ అక్కడికక్కడే చనిపోతాడు. కొడుకును కాపాడేందుకు శివాజీ తానే జైలు కు వెళ్ళటానికి సిద్ధపడతాడు. అయితే అందుకు అంగీకరించని లయ ఎలాగైనా ఎస్ఐ శవాన్ని ఎవరికీ తెలియకుండా బయటకు తీసుకెళ్లి పడేద్దాం అని చెపుతుంది. సినిమా అంతా కూడా ఈ హత్య చుట్టూనే తిరుగుతుంది. ఈ హత్యకు సంబంధించి క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఈ మొత్తం మూవీ లో హై లైట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. సస్పెన్సు థ్రిల్లర్ మూవీ లో అటు అటు శివాజీ, ఇటు లయ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. కాకపోతే రోహన్ రోల్ మరీ అతిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొదలుకాగానే వచ్చే సన్నివేశాలు చూడగానే జనతా గ్యారేజ్ మూవీ లో రాజీవ్ కనకాల రోల్ గుర్తుకు వస్తుంది. ఇదేంటి ఇలా ఉంది అనుకునేలోపే క్రమక్రమంగా అసలు కథలోకి వెళుతుంది. ఆ తర్వాత స్పీడ్ అందుకుంటుంది.

ఎస్ఐ శవాన్ని పెట్టుకుని కారు జర్నీ మరీ ఎక్కువ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. అయితే ఇందులో కావాల్సిన సస్పెన్స్..ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. కథకు అనుగుణంగా సినిమాను నడిపించారు తప్ప ఇందులో ఎక్కడా పాటలు..కామెడీ జొప్పించే ప్రయత్నం చేయలేదు. ఈ మూవీ లో ప్రిన్స్, ధన్ రాజ్, అలీ, రత్ లోహితస్వా లు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. వాస్తవానికి ఓటిటి కోసం అని ఈ మూవీ ని తెరకెక్కించిన తర్వాత ప్లాన్ మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ చేశారు. మొత్తం మీద చూస్తే సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ సస్పెన్స్ ..థ్రిల్లర్ ప్రేమికులకు నచ్చే సినిమానే.

రేటింగ్ : 2 . 75 /5

Next Story
Share it