మొత్తం మూడు సినిమాలు రెడీ

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారబోతోంది. ప్రతి ఏటా సంక్రాంతికి కీలక హీరో ల సినిమాలు పోటీ పడటం సహజమే. అయితే ఈ సారి మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ సినిమా రాజాసాబ్ సంక్రాంతి బరిలోకి రానుండటంతో ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఈ మూవీ 2026 జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత టి జీ విశ్వప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. గురువారం నాడు మిరాయి సినిమా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఈ డేట్ చెప్పారు. దీంతో రాజాసాబ్ విడుదల మరో సారి వాయిదా పడినట్లు అయింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహనన్ నటించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఉన్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే టైటిల్ తో పాటు సంక్రాంతికి రిలీజ్ విషయాన్ని ప్రకటించింది. ఒక్క డేట్ చెప్పలేదు తప్ప..ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతుంది. అంటే వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి వర్సెస్ ప్రభాస్ ల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ నెలకొనటం ఖాయం అయింది అనే చెప్పాలి.
ఈ రెండు సినిమాలే కాదు నవీన్ పోలిశెట్టి మూవీ అనగనగా ఒక రాజు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 14 న విడుదల కానుంది. ఈ విషయాన్ని బుధవారం నాడు వినాయకచవితి సందర్భంగా డేట్ తో సహా వెల్లడించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. సో ఈ లెక్కన వచ్చే సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే మూడు సినిమాలు అధికారికంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాయి. మరి పండగ నాటికీ ఇంకెన్ని సినిమాలు రేస్ లోకి వస్తాయో అన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లో ఉంది. రెండు భారీ సినిమాలు..ఒక మిడ్ రేంజ్ సినిమా ఉండటంతో ఇతరులు సాహసం చేయకపోవచ్చు అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి.



