రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
పుష్ప 2 విజయాన్ని ఇక అల్లు అర్జున్ హాయిగా ఆస్వాదించవచ్చు. ఎందుకంటే ఆయనకు ఇక ఇప్పటికిప్పుడు అరెస్ట్ టెన్షన్ లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ నాలుగు వారాల తాత్కాలిక బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. నాంపల్లి కోర్ట్ శుక్రవారం నాడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇది అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ గానే చెప్పాలి. డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో వేసిన బెనిఫిట్ షో కు అల్లు అర్జున్ హాజరు అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా..ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. చిక్కడపల్లి పోలీస్ లు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అయితే హై కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఆయన పన్నెండు గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ లు అనుమతి నిరాకరించినా కూడా అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి సినిమా చూశారు అని...పోలీస్ లు చెప్పినా కూడా ఆయన సినిమా అంతా పూర్తి అయిన తర్వాత బయటకు వెళతాను అని చెప్పినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు ను చాలా సీరియస్ గా తీసుకోవటంతో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రాకపోతే మరో సారి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది. అయితే నాంపల్లి కోర్ట్ రెండు ఏభై వేల రూపాయల షూరిటీలతో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు అంతా ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆయన అసెంబ్లీ వేదికగా ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ...సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు కానీ మానవత్వం లేకుండా వ్యవహరించారు అంటూ మండిపడ్డారు. తర్వాత ఎఫ్ డీసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయి..వాతావరణాన్ని తేలికపర్చే ప్రయత్నం చేశారు.