విడిపోయిన నాగచైతన్య, సమంత
నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత మరోసారి నిజం అయింది. కొన్నిసార్లు నిప్పు లేకుండా కూడా పొగ సృష్టించేవారు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాలేదు. గత కొన్ని నెలలుగా ఈ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చినా సరే ఇద్దరిలో ఎవరూ నేరుగా స్పందించలేదు. సమంత అయితే తిరుపతిలో మీడియాపై మండిపడింది కూడా. కాకపోతే దర్శనానికి వచ్చిన తనను విడాకుల గురించి అడుగుతావా...బుద్ధుంతా అంటూ ఫైర్ అయింది. నాగచైతన్య అయితే లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఎక్కడా దీనిపై నేరుగా స్పందించలేదు. అయితే శనివారం నాడు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఒకే ప్రకటన విడుదల చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం అధికారికం అయింది. విడాకుల వంటి సున్నితమైన అంశం ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో స్పందనలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్స్ ఆప్షన్ ను కూడా తొలగించేసింది.
' మా శ్రేయోభిలాషులందరికీ ...ఇక మేం భార్యాభర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్యలు,,ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహబంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్టసమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని' శ్రేయోభిలాషులు, మీడియాను కోరారు. 2017, అక్టోబర్ 7న సమంత- నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.