'ఆర్ఆర్ఆర్' వెయ్యి కోట్ల రికార్డు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త రికార్డు నమోదు చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దేశంలోనే ఈ రికార్డు కేవలం మూడు సినిమాలకే ఉండగా..అందులో దర్శకుడు రాజమౌళివే రెండు సినిమాలు ఉండటం మరో విశేషం. విడుదలైన రెండు వారాల్లో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన వాటిలో తొలి భారతీయ సినిమా దంగల్ అయితే..ఆ తర్వాత ఈ రికార్డును బాహుబలి 2 నమోదు చేసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా ఆ స్థానానికి చేరుకోవటం మరో రికార్డుగా నిలిచింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైన వసూళ్ళ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. వసూళ్ళు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. వెయ్యికోట్ల రూపాయల గ్రాస్ సాధించిన విషయాన్ని నిర్మాణ సంస్థ తెలుపుతూ ప్రేక్షకులను ఆలరించేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేశామని..అదే సమయంలో ప్రేక్షకులు మాత్రం తమకు వెలకట్టలేని ప్రేమను చూపించారు అంటూ పేర్కొన్నారు.