ఏపీలో ఆర్ఆర్ఆర్ కు ప్రత్యేక రేట్లు
ఆంద్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ కు అదనపు రేట్ల వసూలుకు ఓకే చెప్పింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ వినతిపత్రం మేరకు ఈ ప్రత్యేక రేట్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల7వ తేదీన జారీ చేసిన రేట్ల కంటే అదనంగా 75 రూపాయల మేర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సినిమా విడుదలైన తొలి పది రోజుల పాటు ఈ రేట్ల పెంపును అనుమతిస్తారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సర్కారు తన ఆదేశాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక రేట్లు అనుమతించాలని సర్కారు కు కమిటీ నివేదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన సినిమా నిర్మాణ వ్యయ వివరాలు ప్రభుత్వానికి సమర్పించి..ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న వాటికే ఈ నిబంధన వర్తింపచేయనున్నట్లు తెలిపారు.
అయితే ఈ జీవో జారీ సమయానికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయినందున దీనికి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం తలెత్తిన సమయంలో ఎవరి సినిమాకు అయినా ఒకే రేట్లు ఉంటాయని..తమకు సంపూర్ణేష్ బాబు అయినా..మహేష్ బాబు అయినా ఒకటే అంటూ కొంత మంది మంత్రులు వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పేదవారికి అందుబాటులో ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు తగ్గిస్తుంటే కొంత మంది వ్యతిరేకిస్తున్నారని..వీరంతా పేదల వ్యతిరేకులు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు చేసిన ఆయన కొన్ని రోజులకే తనను సినిమా ప్రముఖులు కలసిన వెంటనే రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అదనపు రేట్లకు కూడా అనుమతి ఇచ్చారు.