'ఆర్ఆర్ఆర్' విడుదల మార్చి 25న
దేశ వ్యాప్తంగా కరోనా కొత్తరకం ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కీలక సినిమాలు అన్నీ క్యూకడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమా విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే ఇప్పుడు ముందు ప్రకటించిన మార్చి 18 తేదీని కూడా మార్చేసి మార్చి 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉంది.
ఆ సమయంలో ఒమిక్రాన్ కేసుల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిగా మూసివేయటం, మరికొన్ని చోట్ల కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించటం, ఏపీలో టిక్కెట్ రేట్ల వ్యవహారం వంటి కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమా మరి మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఎంత సందడి చేస్తుందో వేచిచూడాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.