ఆస్కార్ ఎంట్రీ కోసమే రాజమౌళి ఆ సంస్థను హైర్ చేశారా?!

టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని భారీగా ప్రచారం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయలుపైనే వసూలు చేసింది. ఈ సినిమా విషయంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినా వసూళ్లపరంగా మాత్రం సక్సెస్ అయింది. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తొలిసారి ఓ మల్టీస్టారర్ లో నటించి కమర్షియల్ గా విజయం అందుకున్నారు. రాజమౌళికి కూడా ఈ సక్సెస్ కలిసొచ్చింది. అయితే ఆస్కార్ బరిలో నిలవాలన్న దర్శకుడు రాజమౌళి ఆకాంక్ష నెరవేరలేదు. కానీ భారత్ నుంచి గుజరాతీ సినిమా చెల్లో షో ఆస్కార్ బరిలో నిలిచింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) దీన్ని ఎంపిక చేసింది. దీంతో తీవ్ర నిరాశచెందిన రాజమౌళి రంగంలోకి దిగి అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్ ప్రమోటింగ్ ఏజెన్సీ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీఏఏ)తో ఒప్పందం చేసుకున్నారు.
భవిష్యత్ లో తాను నిర్మించే చిత్రాలను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయటంతోపాటు..ఆర్ఆర్ఆర్ సినిమా ఏ మార్గంలో అయినా ఆస్కార్ బరిలో నిలిచేలా చూసే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించినట్లు పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సీఏఏ భారీ ఎత్తున లాబీయింగ్ చేయటంతో పాటు అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని..అందులో భాగంగానే ఇప్పుడు జనరల్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు దరఖాస్తు చేసుకుంది. దీనికి అవసరమైన కసరత్తు అంతా సీఏఏనే చేసిందని టాలీవుడ్ టాక్. దీనికి ఫీజు కింద కూడా కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అయితే రాజమౌళి సీఏఏతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని పలు జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. గురువారం నాడు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తాము ఆస్కార్ బరిలో దిగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కీలక విభాగాలు అన్నింటిలో ఆర్ఆర్ఆర్ కీలక విభాగాలు అన్నింటిలో ఆస్కార్ రేసులో పోటీపడనుంది.