గేమ్ ఛేంజర్ సినిమా రేట్ల పెంపునకు ఓకే
తెలంగాణ సర్కారు పరువుపోయింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువ లేకుండా అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టిజీఎఫ్ డీసి) కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కు సరెండర్ అయ్యారు అనే చర్చ తెరమీదకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షో లతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేదిలేదు అని అసెంబ్లీ లో..బయటా కూడా అధికారికంగా ప్రకటించింది.కానీ ఈ మాటలు చెప్పి నెల రోజులు కాకముందే రేవంత్ రెడ్డి సర్కారు మాట తప్పింది.
సంక్రాంతి కి విడుదల అవుతున్న గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షో లతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ సర్కారు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమా టికెట్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కు వచ్చిన సానుకూల వాతావరణం అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అయింది. ఒక్క బెనిఫిట్ షో లకు మాత్రమే తెలంగాణ సర్కారు నో చెప్పింది. సినిమా విడుదల అయిన రోజు ఏకంగా ఆరు షో లు...అదనపు రేట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మరుసటి రోజు నుంచి ఐదు షో లు ..అది కూడా తొమ్మిది రోజుల పాటు ఆమోదం తెలిపింది. సినిమా రిలీజ్ రోజు మల్టీప్లెక్స్ ల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 100 రూపాయల మేర అదనపు రేట్లకు ఆమోదం తెలిపారు.
మిగిలిన తొమ్మిది రోజుల్లో మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో ఏభై రూపాయల మేర పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. అసలు టికెట్ రేట్ల పెంపు ఉండదు అని చెప్పి దిల్ రోజు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ పాత బాటలో నడవటనికి సిద్ధం అవటంతో రాబోయే రోజుల్లో కూడా ఇక ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయం అని చెపుతున్నారు. కొంత కొంతలో కొంత ఊరట ఏంటి అంటే మరీ గతంలో పెంచినట్లు అడ్డగోలుగా అదనపు రేట్లు ఇవ్వలేదు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం తెలంగాణ సర్కారు రేట్లు పెంపునకు ఒకే చెప్పటం తో రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.