Telugu Gateway
Cinema

రూట్ మార్చి హిట్ కొట్టిన రవి తేజ

రూట్ మార్చి హిట్ కొట్టిన రవి తేజ
X

రూట్ మార్చిన రవితేజ ఫస్ట్ అట్టెంప్ట్ కే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత వేగంగా ఒక ప్రాంతీయ చిత్రం మూడు రోజుల్లో 80 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన రికార్డు నెలకొల్పినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. అదే సమయంలో రవి తేజ హీరో గా నటించిన సినిమా ఒకటి ఉత్తర అమెరికా మార్కెట్ లో మిలియన్ డాలర్స్ వసూళ్లు చేయటం కూడా ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి రవి తేజ ఇరుముడి సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో నమోదు అయ్యాయి.

ఈ సోమవారం నాడు కూడా సినిమాకు సాలిడ్ బుకింగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో రవి తేజకు జోడి గా ప్రియా భవాని శంకర్ నటించింది. మరో కీలక పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రీ, కూతుళ్ళ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయింది. దీంతో ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి తేజకు ఇరుముడి సినిమా సూపర్ కంబ్యాక్ ఇచ్చింది.

Next Story
Share it