డబుల్ సెంచరీ కొట్టిన ఇరుముడి

రవి తేజ చరిత్ర సృష్టించాడు. ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఒక సినిమా ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరింది. వరస పరాజయాలతో ఉన్న రవి తేజ ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సెప్టెంబర్ 1 నాటికీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు 200 కోట్ల రూపాయల వసూళ్ల పోస్టర్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. పిల్లలు..పెద్దలు..యువత ఇలా ప్రతి ఒక్కరూ తమ సినిమాను ఆదరించటం వల్లనే ఈ రికార్డు ను సాధించగలిగినట్లు వెల్లడించారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రవి తేజ హీరో గా నటించిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున బుకింగ్స్ నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి, కూతురు సెంటిమెంట్ అంశాలతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు ఈ సినిమాను ఓన్ చేసుకోవటంతో ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రవి తేజ సినిమాకు ఇంత భారీ మొత్తంలో కలెక్షన్స్ రావటం ఇదే మొదటి సారి.



