Telugu Gateway
Cinema

రూట్ మార్చిన రవితేజ కు హిట్ దక్కిందా?!(Bharta Mahashayulaku Vignapti Review)

రూట్ మార్చిన రవితేజ కు హిట్ దక్కిందా?!(Bharta Mahashayulaku Vignapti Review)
X

హీరో రవితేజ గత కొంత కాలంగా వరసగా ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో ఈ సంక్రాంతికి స్టైల్ మార్చి..మాస్ మహారాజా అనే టైటిల్ పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ తో ప్రయోగం చేశాడు. ఈ సంక్రాంతి పోటీ లో ఏకంగా చాలా సినిమాలు ఉన్నా కూడా ఏ మాత్రం వెరవకుండా భర్త మహాశయులకు విజ్ఞప్తికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ కు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు నటించారు. మరి స్టైల్ మార్చి చేసిన ప్రయోగం సక్సెస్ అయిందా...టాలీవుడ్ హీరోలకు కలిసి వచ్చే సంక్రాంతి రవితేజ కు కూడా కలిసొచ్చిందా లేదా అన్నది చూద్దాం.

హీరో రవితేజ హైదరాబాద్ లో భార్య డింపుల్ హయతి తో కలిసి ఒక వైన్ ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. తమ అమ్మకాలు పెంచుకునేందుకు స్పెయిన్ లో ఎంతో పేరున్న కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ ప్రయత్నం రిజెక్ట్ అవుతుంది. కారణం ఏంటో తెలుసుకుని నేరుగా కంపెనీ ఎండీ తో మాట్లాడేందుకు రవితేజ తన పీఏ వెన్నెల కిషోర్ తో కలిసి స్పైయిన్ వెళతాడు. ఈ కంపెనీ ఓనర్ మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆషికా రంగనాథ్ దగ్గర నమ్మిన బంటులా పనిచేస్తూ ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ఆమె ప్రత్యర్థులతో చేతులు కలుపుతాడు పీఏ సత్య. ఈ సమయంలోనే స్పెయిన్ లో వైన్ బిజినెస్ లో టాప్ లో ఉన్న కంపెనీ ఎండీ కి బాగా దగ్గర అవుతాడు రవితేజ. దీన్ని అడ్డం పెట్టుకునే ఒప్పందం చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తాడు. రవితేజ తనకు పెళ్లి అయిన విషయం దాచిపెట్టి స్పెయిన్ లో కంపెనీ ఎండీ కి చేరువ అవుతాడు. తన భర్త రాముడు అని నమ్మే భార్య...పెళ్లి అయి కూడా తన దగ్గర విషయం దాచాడు అని పగబట్టిన మరో మహిళ మధ్య నలిగిపోయే కథతో సినిమా అంతా సాగుతుంది.

గత సినిమాలకు భిన్నంగా రవితేజ ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోటం ద్వారా సంక్రాంతి సినిమాతో గాడినపడ్డాడు అనే చెప్పాలి. భార్య..మరో మహిళ మధ్య నలిగిపోయే వ్యక్తి పాత్రలో రవితేజ నటన ఆకట్టుకుంటుంది. డింపుల్ హయతి కంటే ఈ సినిమా ద్వారా గతంలో ఎన్నడూ పోషించని రీతిలో గ్లామరస్ రోల్ తో ఆషికా రంగనాథ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో సత్య కామెడీ బాగానే ఉన్నా కూడా కొన్ని సార్లు ఓవర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. వెన్నెల కిషోర్, సునీల లవి రొటీన్ పాత్రలే. విలన్ గా అక్కడక్కడా అజయ్ ఘోష్ కనిపించినా అదేమీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హీరో రవితేజ – తారక్ పొన్నప్ప మధ్య మైండ్ గేమ్ కూడా అంతా వర్క్ అవుట్ కాలేదు. నిర్మాత చెరుకూరి సుధాకర్ సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. మొత్తం మీద భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేకపోయినా రవితేజ మాత్రం ఈ సినిమాతో ఒకింత గాడిన పడినట్లే అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2 .75 /5

Next Story
Share it