ఈ సారి పక్కా!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నెల చెప్పింది కానీ...రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు ధనుష్ హీరోగా నటించిన కర సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ పెద్ది సినిమాను జూన్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది అని వెల్లడించారు. ధనుష్ పై ఉన్న అభిమానంతోనే ఈ ఈవెంట్ కు షూటింగ్ దగ్గర నుంచి నేరుగా వచ్చినట్లు వెల్లడించారు. అభిమానులు పెద్ది అప్డేట్ కోసం కేకలు వేయటంతో ఆయన ఈ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
తొలుత ఈ మూవీని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ గా జూన్ 25వ తేదీని లాక్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల పాటలు మంచి ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే.



