Telugu Gateway
Cinema

ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు

ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు
X

పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలపై ఎంత భారం పడినా పర్వాలేదు. నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నా కూడా పెద్దగా పట్టించుకొవాల్సిన అవసరం లేదు. ఒక వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు పాటించాలి అని చెప్పగానే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తమ తమ కాన్వాయ్ ల పరిమాణం తగ్గించుకున్నారు. దీనిపై ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సినిమా అభిమానులపై ఈ సంక్షోభ సమయంలో కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. అన్ని సినిమాలకు ఇచ్చినట్లే ఈ సారి రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చారు. అంతా సాఫీగా ఉన్న సమయంలో అయితే దీనిపై పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పశ్చిమాసియాలో తలెత్తిన పరిస్థితుల కారణంగా అన్ని రకాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు పొదుపు చేయటం కోసం అని చెప్పి అధికార తెలుగు దేశం పార్టీ తన మహానాడు ను కూడా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించింది. కానీ ప్రేక్షకులపై భారం మోపే విషయంలో మాత్రం ఈ కోణాన్ని పూర్తిగా విస్మరించింది అనే చెప్పాలి.

అందుకే ఇప్పుడు కూడా రామ్ చరణ్ హీరో గా నటించిన పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంచుకోవటానికి మాత్రం అనుమతి ఇచ్చింది. అంతే కాదు...ప్రీమియర్ షోస్ టికెట్ ధరను 600 రూపాయలు గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమా విడుదల అయినప్పటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టిప్లెక్స్ ల్లో టికెట్ రేట్లను 100 రూపాయలు..125 రూపాయల మేర పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. పలు మార్లు వాయిదా పడిన పెద్ది సినిమా జూన్ 4 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 3 రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ వేయనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే పెద్ది సినిమా దగ్గర నుంచే తమకు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజీ విధానంలో చెల్లింపులు చేయాలంటూ మూవీ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయంలో చిరంజీవి రంగంలోకి దిగి జూన్ 30 తర్వాత నుంచి పర్సంటేజీ విధానంలో చెల్లింపులకు మార్గం సుగమం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. దీంతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమా పెద్ది కి ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పినట్లు అయింది. రెంటల్ విధానంలో తమకు పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి అని..అన్ని చోట్ల పర్సంటేజీ విధానం ఉంటే ఇక్కడ మాత్రమే రెంటల్ విధానంతో తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని...గతంలో కూడా హామీ ఇచ్చి దీన్ని అమలు చేయలేదు అని ఎగ్జిబిటర్లు ఆరోపించారు. మరి జూన్ నెలాఖరు నుంచి అయినా పర్సంటేజీ విధానం అమలులోకి వస్తుందో రాదో చూడాలి. ఆంధ్ర ప్రదేశ్ ఎప్పటిలాగానే పెద్ది సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి మంజూరు చేశారు. మరి తెలంగాణ సర్కారు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Next Story
Share it