Telugu Gateway
Cinema

హిట్ ట్రాక్ లోకి రామ్ చరణ్

హిట్ ట్రాక్ లోకి రామ్ చరణ్
X

పెద్ది మూవీ విడుదల అయిన తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. ఈ సినిమా జూన్ 4 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా మన శంకరవరప్రసాద్ గ్రాస్ వసూళ్లు 300 కోట్ల రూపాయలను అదిగగమించగా..ఇప్పుడు రామ్ చరణ్ మూవీ 345 కోట్ల రూపాయల వసూళ్లను సాధించటం విశేషం. థియేట్రికల్ రన్ పూర్తి అయ్యేనాటికి ఈ మూవీ కలెక్షన్స్ 400 కోట్ల రూపాయలకు చేరవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ది మూవీని పాన్ ఇండియా మార్కెట్ కోసం అంటూ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా ఎక్కువ వసూళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఉన్నాయి అని చెప్పాలి.

హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా పెద్ది మూవీ కలెక్షన్స్ ఏమంత ఆశాజనంగా లేవు అని గణాంకాలు చెపుతున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ దారుణ ఫలితం చవి చూసిన తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు పెద్దితో హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు అయింది. దర్శకుడు సానా బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడి గా జాన్వీ కపూర్ నటించింది. ప్రధానంగా ఈ సినిమాలో రామ్ చరణ నటనకు అన్ని వర్గాల నుంచి అభినందనలు రాగా...జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. అసలు జాన్వీ కపూర్ ఇలాంటి రోల్ ఎందుకు ఒప్పుకుంది అనే చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇదే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పటంతో కొన్ని సీన్స్ ను తొలగించారు కూడా. పెద్ది మూవీ కి ఏ ఆర్ రెహ్మాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

Next Story
Share it