తొలిసారి పౌరాణిక పాత్రలో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైం పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నాడు. అది కూడా సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ద్వారా. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. శనివారం నాడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో వారణాసి మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లోబ్ ట్రోటర్ వర్కింగ్ టైటిల్ తో ఇంత కాలం పిలిచిన ఈ మూవీ కి ప్రచారంలో ఉన్నట్లే వారణాసి అనే పేరు ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత కె ఎల్ నారాయన దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదల కూడా 2027 సమ్మర్ లో ఉంటుంది అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి తో పాటు మహేష్ బాబు , హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ..పౌరాణిక పాత్రలో చేయమని నాన్న ఎప్పుడూ అడుగుతుండేవారు. ఆయన మాటలు నేను ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు.
ఆయన ఆశీస్సులు ఎప్పుడు తనకు ఉంటాయి అని వ్యాఖ్యానించారు. వారణాసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను అని తెలిపారు. అందర్నీ గర్వ పడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. వారణాసి విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక అభిమానులకు నేను ఏం చెప్పాలి. నాకు తెలిసింది ఒక్కటే. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేమి తెలియదు. అభిమానుల సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి అన్నాడు. గ్లింప్స్ లో మహేష్ బాబు ను రాముడి పాత్రలో చూపించిన విజువల్ వైరల్ గా మారింది. రాముడి పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు అని..ఈ ఫోటో ను తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుని..లుక్ లీక్ అవుతుంది అని తీసేసినట్లు రాజమౌళి వెల్లడించారు. మహేష్ బాబు షూటింగ్ లో ఉన్న సమయంలో అసలు ఫోన్ వాడారని...అది ఆరు. ఏడు గంటలు అయినా కూడా అలాగే ఉంటారు అన్నారు. ఈ విషయంలో తాను మహేష్ బాబు చూసి నేర్చుకుంటాను అన్నారు రాజమౌళి.



