Telugu Gateway
Cinema

రాజమౌళి మళ్ళీ దొరికారు

రాజమౌళి మళ్ళీ దొరికారు
X

టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి మళ్ళీ దొరికిపోయారు. గతంలో పాత సినిమాల్లోని కొన్ని సీన్లను తన సినిమాల్లో మక్కీకి మక్కి కాపీ కొట్టేశారు. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టి మరీ ట్రోల్ చేశారు. గురువారం నాడు ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో డైలాగ్ లు, సీన్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇందులో రెండు సీన్లను నెటిజన్లు పట్టేసుకున్నారు. ఏ సీన్లు..ఎలా..ఎక్కడనుంచి కాపీ కొట్టారో స్క్రీన్ షాట్లు తీసి మరీ నెట్ లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఇది ఒకింత ఇబ్బందికరంగా మారింది. అయితే వీటిపై చిత్ర యూనిట్ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు.

ఎన్టీఆర్ పాత్ర పరిచయ వీడియోలో 'వాడి పొగ‌రు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ..' అని రామ్ చ‌ర‌ణ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తున్న స‌మ‌యంలో ఓ అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ధ‌లైన‌ట్లు చూపిస్తారు. చాలామంది అది ఎక్క‌డిదా అని వెతికి తీసి..నేష‌నల్ జియోగ్రాఫిక్ ఛాన‌ల్ లోనిది అని తేల్చారు. ఆ ఛాన‌ల్ తొమ్మిది నెల‌ల క్రితం అగ్నిప‌ర్వ‌తాల విస్ఫోట‌నం గురించి యూట్యూబ్‌లో వీడియో పెట్ట‌గా అది ఇప్పుడు సినిమాకు ఉప‌యోగ‌ప‌డింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో దట్టమైన అడవి..అందులో మబ్బులతో కూడిన అందమైన సీన్లను కడా కాపీ కొట్టినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పెట్టేసి ఆడుకుంటున్నారు నెటిజన్లు. మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటూ ప్రకటించి మరి కాపీకొట్టుడేంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు మరికొంత మంది.

Next Story
Share it