120 దేశాల్లో విడుదల!

దర్శకుడు రాజమౌళి నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది అంటే చాలు ఆ సినిమాపై అంచనాలు అలా పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం ఆయనకున్న ట్రాక్ రికార్డు అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా దేశ వ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేసుకోవటమే కాదు...వసూళ్ల విషయంలో కూడా అంతే సంచలనాలు నమోదు చేశాయి. అందులోనూ మహేష్ బాబు తో కొత్త సినిమా ప్రకటించటంతో ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేపుతోంది. అంతే కాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అంటే ఏకంగా 120 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు చెపుతున్నారు. అదే జరిగితే ఇది రాజమౌళి సృష్టించిన మరో రికార్డు గా మారుతుంది కూడా.
రాజమౌళి ఏ సినిమా ప్రకటించినా కూడా ఆయన ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయటానికి దగ్గర దగ్గర రెండు నుంచి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటారు అనే అభిప్రాయం అందరిలో ఉంది. ఇందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. రాజమౌళి. మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయి ఇప్పటికే ఏడాది పైనే అయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అన్న చర్చ గత కొన్ని రోజులుగా సాగుతోంది. వీటి అన్నిటికి చెక్ పెడుతూ దర్శకుడు రాజమౌళి వారణాసి మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం మహేష్ బాబు హీరోగా ..ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 7 న విడుదల కానుంది.



