డేట్ ...టైం చెప్పిన నిర్మాణ సంస్థ

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని భావించారు. కానీ ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి మార్చారు. కొద్ది రోజుల క్రితం నిర్మాత టి జీ విశ్వప్రసాద్ అధికారికంగా ఈ విషయం వెల్లడించారు. ఇప్పుడు చిత్ర యూనిట్ రాజాసాబ్ మూవీకి సంబంధించి ఆదివారం నాడు కీలక అప్డేట్ ఇచ్చింది. అదేంటి అంటే సోమవారం సాయంత్రం అంటే సెప్టెంబర్ 29 ఆరు గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దసరా పండగా స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు ఈ ట్రైలర్ తేనున్నారు. ఈ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
కొద్ది రోజుల క్రితం విడుదల అయిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు నటిస్తున్నారు. సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రైలర్ డేట్ తో కూడిన న్యూ లుక్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది.



