మన శంకరవరప్రసాద్ గారు మూవీ యూనిట్ దరఖాస్తు!

తెలంగాణాలో రాజాసాబ్ ప్రీమియర్స్ కు స్పెషల్ రేట్లు ఉంటాయా?. ఇదే ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉన్న అనుమానం. దీనికి ప్రధాన కారణం గత నెలలో విడుదల అయిన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కోర్ట్ కు చేరటం...కోర్ట్ ఆదేశాలతో చివరి నిమిషం వరకూ ప్రీమియర్స్ పై అనుమానాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్రతి సినిమా కు ఇలా విడివిడిగా ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్ల పెంపునకు జీవో లు ఇవ్వటం..దీనిపై కొంత మంది కోర్టు లకు వెళుతుండంతో ప్రతి సారి ఇది చివరి నిమిషంలో చికాకులు సృష్టిస్తోంది. మరో వైపు అఖండ 2 వివాదం తలెత్తినప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియకుండా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచారు అని...ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు అని ప్రకటించారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం ప్రకటించి కూడా దీనికి తూట్లు పొడిచారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మాటలు నిజంగా అమలు అవుతాయా ...లేక ఎప్పటిలాగానే ఈ సారి కూడా రాజాసాబ్ దగ్గర నుంచి ఇతర సినిమాలకు కూడా రేట్లు పెంచుతారా అన్నది వేచిచూడాల్సిందే.
అయితే ఈ సంక్రాంతికి వస్తున్న వాటిలో భారీ బడ్జెట్ మూవీ అంటే రాజాసాబ్ ఒక్కటే అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకరవరప్రసాద్ గారు మూవీ యూనిట్ టికెట్ రేట్ల పెంపు వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కనిపించటం లేదు అనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా యూనిట్ కూడా తెలంగాణాలో ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్ల పెంపునకు దరఖాస్తు చేసుకుంది. మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ కు 600 రూపాయలు టికెట్ రేట్ ప్రతిపాదించారు. మిగిలిన సినిమాలు తెలంగాణ లో అయితే పాత రేట్లతోనే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు. రాజాసాబ్ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికే తెలంగాణ లో ప్రీమియర్ షో లతో పాటు స్పెషల్ రేట్లకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీని ప్రకారం ప్రీమియర్స్ కు మల్టీప్లెక్స్ ల్లో వెయ్యి రూపాయలు..సింగిల్ స్క్రీన్స్ లో 800 రూపాయల టికెట్ ధరను ప్రతిపాదించారు.
ఈ సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ విడుదల అవుతున్న సినిమా ఇదే. జనవరి 9 న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా...జనవరి ఎనిమిది రాత్రి నుంచి ప్రీమియర్ షో స్ కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ పూర్తి కాగా..రన్ టైం మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంది. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్ల పెంపునకు పెద్దగా ఎలాంటి ఆటంకాలు ఉండే అవకాశం ఉండదు అని భావిస్తున్నారు. దీనికి రాజాసాబ్ సినిమా నిర్మాత టి జీ విశ్వప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరుంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం కొత్త సినిమాలకు ఎప్పటి నుంచి టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూనే ఉంది.



