'రాధేశ్యామ్' సంక్రాంతికి రావటం పక్కా
ఆర్ఆర్ఆర్ విడుదల ఆగింది. మరి రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి?. సినిమా ప్రియుల్లో గత కొన్ని రోజులుగా ఇదే చర్చ. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉంటాయా ఉండవా అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం దేశ వ్యాప్తంగా కోవిడ్, ఒమిక్రాన్ కేసులు అనూహ్యంగా పెరగటం, ఏపీలో టిక్కెట్ల పంచాయతీ. అయితే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్ర యూనిట్ ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. సంక్రాంతి బరిలో నిలవటం పక్కా అని చిత్ర నిర్మాతలు సోమవారం నాడు స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుష్. సాహో తర్వాత ప్రభాస్ సినిమా ఏదీ విడుదల కాలేదు.
దీంతో తమ అభిమాన హీరో కొత్త సినిమా ఎప్పుడప్పుడు విడుదల అవుతుదా అని వీరు అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా టైమ్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డె నటించిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ 'రాధేశ్యామ్'ను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కన్పించనున్నారు. అతడి గురువు పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉంది.